Tamil Nadu Governor Walks out of Assembly | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ సారి అసెంబ్లీలో జాతీయ గీతం వివాస్పదంగా మారింది. సోమవారం జనవరి 6, 2025న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి అసెంబ్లీ తన ప్రారంభ ప్రసంగాన్ని చదవాల్సి ఉండగా.. ఆయన ప్రసంగం చదవడానికి నిరాకరించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో జాతీయ గీతం (National Anthem) పాడలేదని ఆయన కారణం చూపించి.. ఇది జాతీయ గీతానికి జరిగిన అవమానమని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అయితే తమిళనాడు సంప్రదాయ ప్రకారం.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ థయ్ వాల్తు గీతాన్ని’ పాడుతారు. అసెంబ్లీ సెషన్ ముగిసిన తరువాత జాతీయ గీతం జనగణ మన పాడుతారు. కానీ తమిళనాడు గవర్నర్ రవి ఈ సంప్రదాయానికి వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభం, ముగింపు.. రెండు సందర్భాల్లోనూ జాతీయ గీతం ఆలపించాలని చెప్పారు.
ఈ ఘటన తరువాత గవర్నర్ కార్యాలయమైన రాజ్ భవన్ నుంచి ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. “ఈ రోజు భారత రాజ్యాంగం, జాతీయ గీతానికి మరోసారి తమిళనాడు అసెంబ్లీలో అవమానం జరిగింది. రాజ్యాంగం ప్రకారం.. జాతీయ గీతాన్ని గౌరవించడం మనందరి మౌళిక బాధ్యత. అన్ని రాష్ట్ర అసెంబ్లీలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని పాడుతారు. కానీ ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో తమిళ థయ్ వాళ్లు గీతాన్ని ఆలపించారు. ఈ సంఘటన తరువాత అసెంబ్లీ స్పీకర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి జాతీయ గీతాన్ని పాడాల్సిన బాధ్యత గురించి గవర్నర్ గౌరవప్రదంగా గుర్తు చేశారు. కానీ వారు అమర్యాదగా అలా చేసేందకు నిరాకరించారు. ఇది చాలా విచారకర అంశం. ఒక రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అవమానించింది. దీంతో గవర్నర్ ఆవేదనతో అసెంబ్లీ నుంచి బయలు దేరి వచ్చేశారు. ” అని ఆ ప్రకటనలో ఉంది.
అయితే అసెంబ్లీ సమావేశం తరువాత గవర్నర్ చేయాల్సిన ప్రసంగాన్ని అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు చేశారు. ఇలా గవర్నర్ ప్రసంగం చేయకుండా అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు 2022లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో చాలా అసత్యాలు ఉన్నాయని, కొందరి ప్రముఖలు పేర్లు ఉన్నాయని చెబుతూ గవర్నర్ ఆర్ ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రసంగంలో తమిళనాడుతో ద్రవిడ మాడల్ ప్రకారం శాంతి, భద్రతలు, చట్టాలు ఉంటాయని ఉంది, పైగా బిఆర్ అంబేడ్కర్, పెరియార్, సిఎన్ అన్నాదురైల పేర్లున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన జాతీయ గీతం పాడేంతవరకు ఉండకుండా అసెంబ్లీ నుంచి కోపంగా వాకౌట్ చేశారు. అప్పటి నుంచి అసెంబ్లీలో అధికార పార్టీ ఓ తీర్మానం చేసింది. గవర్నర్ ప్రసంగానికి బదులు అధికార పార్టీ ప్రసంగం ఉండేలా మార్పులు చేసింది.
Also Read: ప్రియాంక గాంధీ, సిఎం ఆతిషిలపై బిజేపీ నాయకుడి అసభ్యకర వ్యాఖ్యలు.. వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు
2021 లో గవర్నర్‌గా ఆర్ ఎన్ రవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నాయకత్వంలోని అధికార డిఎంకె పార్టీతో ఆయనకు మధ్య మాటల యుద్ద కొనసాగుతూనే ఉంది. గవర్నర్ రవి బిజేపీ చేతిలో కీలుబొమ్మగా, బిజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని డిఎంకె ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన కొన్ని బొల్లులను గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా తన కార్యాలయంలోనే చాలా కాలం పాటు పెండింగ్ లో పెట్టేశారు. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టు, రాష్ట్రపతి వరకు వెళ్లింది.
ఇలాంటి కేసులో సుప్రీం కోర్టు, మద్రాస్ హై కోర్టులు గవర్న్ లు రాష్ట్ర మంత్రివర్గంతో కలిసి మెలిసి పనిచేయాలని హితువు పలికాయి.