Vande Bharat Sleeper Train Record: వందేభారత్ స్లీపర్ రైలు భారతీయ రైల్వేలో సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది. ఇప్పటి వరకు ఏ రైలు వెళ్లలేనంత వేగంతో దూసుకెళ్లే ట్రైన్ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది. గత కొద్ది రోజులుగా DRSO పర్యవేక్షణలో స్లీపర్ రైలు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో రైలు ఏకంగా గంటకు 180 కి. మీ వేగంతో దూసుకెళ్తూ అబ్బురపరిచింది. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్స్ మరికొద్ది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తున్నది.
గురువారం (జనవరి 2న) నాడు వందే భారత్ స్లీపర్ రైలు రాజస్థాన్ లోని బుండి జిల్లా కోటా- లాబాన్ మధ్య లోడ్ చేసిన వందేభారత్ స్లీపర్ రైలు స్పీడ్ టెస్ట్ లో భాగంగా 30 కిలోమీటర్లు ప్రయాణించింది. కదులుతున్న రైలులో ఉంచిన వాటర్ గ్లాస్ లోని నీళ్లు కదలకుండా ఉండటం విశేషం. అంతేకాదు, లోకోమోటివ్ 180 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకున్నట్లు చూపిస్తున్న వీడియోను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వందే భారత్ స్లీపర్ రైళ్ల ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే?
ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాగానే రైల్వే సేఫ్టీ కమిషనర్ రైలును దాని గరిష్ట వేగాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత క్లియరెన్స్ లభించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ సర్వీస్ కోసం భారతీయ రైల్వే సంస్థకు అప్పగించబడతాయి.
🚄 Train journey redefined with comfort, safety and innovation.✨
Vande Bharat Sleeper Express, features we must know!🧵👇🏻 pic.twitter.com/zXgusgLKLi
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2024
13 గంటల జర్నీ 5 గంటల్లోనే..
ఇక తొలి వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-శ్రీనగర్ నడుమ నడవనున్నట్లు తెలుస్తున్నది. సుమారు 600 కిలో మీటర్ల దూరాన్ని వందేభారత్ రైలు కేవలం 5 గంటల్లో చేరుకోనున్నది. అదే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే 800 కిలో మీటర్లు చేసుకునేందుకు సుమారు 13 గంటల సమయం పడుతుంది. కానీ, వందేభారత్ స్లీపర్ రైలుతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైలు సర్వీసు లేదు. త్వరలోనే ఉధంపూర్- బారాముల్లా-శ్రీనగర్ రైల్వే లింక్ ప్రారంభం కానున్నది. ఈ రైల్వే లైన్ ద్వారా వందేభారత్ స్లీపర్ రైలు 160కి పైగా కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. ఈ మార్గంలో రైలు 12 స్టేషన్లలో ఆగనుంది. వందేభారత్ రైలు ప్రారంభం తర్వాత జమ్మూకాశ్మీర్ లో పర్యాటకరంగం మరిత అభివృద్ధి చెందనుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేక లక్షణాలు
వందేభారత్ స్లీపర్ రైలు అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. జమ్మూకాశ్మీర్ లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ రైలును రూపొందించారు. ఈ రైల్లో ఆన్-బోర్డ్ వై-ఫై సౌకర్యాన్ని అందించనున్నట్లు తెలుస్తున్నది. అల్ట్రా కంఫర్టబుల్ బెడ్లు, ఆటోమేటిక్ డోర్లు, విమానం లాంటి డిజైన్ తో ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. జమ్మూకాశ్మీర్ లో చలిని తట్టుకునేలా కోచ్ హీటర్లను ఏర్పాట్లు చేయనున్నారు. రైల్లో వాడే నీళ్లు గడ్డ కట్టకుండా తగిన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 సెమీ హై స్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తున్నాయి.
Read Also: అందుబాటులోకి తొలి నమో భారత్ రైలు, జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ!