IRCTC Tour Package: దేశవ్యాప్తంగా పర్యాటక సేవలు అందిస్తున్న IRCTC ఇప్పుడు భారత గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్ ద్వారా ఈశాన్య భారతాన్ని ఒకే ప్రయాణంలో చూపించే ప్రత్యేక టూర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే విమానాలు, రోడ్డు ప్రయాణాలు, వేర్వేరు బుకింగ్‌లు ఇలా చాలా తలనొప్పులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నింటికీ పరిష్కారంగా రైల్లోనే సౌకర్యవంతంగా దేశంలోని ఏడు రాష్ట్రాల అందాన్ని చూపించడమే ఈ టూర్ ముఖ్య లక్ష్యం. ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి అన్నీ ఒకే ప్రయాణంలో అనుభవించే అవకాశం ఈ భారత గౌరవ్ నార్త్ ఈస్ట్ టూర్ ఇస్తోంది.
టూర్ ప్రత్యేకత ఏమిటంటే
ఈ ప్రయాణం మొత్తం 15 రాత్రులు, 16 రోజుల పాటు సాగుతుంది. సాధారణ రైలు ప్రయాణంలా కాకుండా డీలక్స్ ఏసీ కోచ్‌లు, కంఫర్టబుల్ బెడ్స్, శుభ్రమైన వాష్ రూమ్స్, భోజన సదుపాయాలు అన్నీ ఇందులో ఉంటాయి. రైలులో ప్రయాణిస్తూనే దేశంలోని అత్యంత అందమైన ప్రాంతాల వైపు అడుగులు వేయడం ఈ టూర్ ప్రత్యేకత. ప్రతి నగరంలో దిగిన తర్వాత స్థానిక దర్శనాలు, ప్రత్యేక టూర్లు ముందే ప్లాన్ చేసి ఇస్తారు.
ప్రయాణం ప్రారంభం, రూట్ వివరాలు
ఈ భారత గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్ ప్రయాణం ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అస్సాంలోని గువాహటి చేరుకొని కామాఖ్యాదేవి ఆలయ దర్శనం వంటి ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి. తర్వాత ఇటానగర్, సిబ్సాగర్, జోర్హాట్ ప్రాంతాల ద్వారా అస్సాం చరిత్ర, అహోం రాజవంశ వారసత్వం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాజిరంగా నేషనల్ పార్క్‌లో ఒక కొమ్ము గండం సహా అరుదైన వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అనుభవం ఈ ప్రయాణంలో కీలకంగా మారనుంది.
ఈశాన్య రాష్ట్రాల అందాల అనుభవం
అస్సాం తర్వాత త్రిపురలోని ఉనకోటి శిల్పాలు, అగర్తలాలోని చారిత్రక భవనాలు ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. మిజోరాంలోని ఐజ్వాల్ నగరం, పచ్చని కొండలు, ప్రశాంత వాతావరణం ప్రయాణికులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. నాగాలాండ్‌లోని డిమాపూర్, కోహిమా ప్రాంతాలు అక్కడి గిరిజన సంస్కృతి, చరిత్రను దగ్గర నుంచి చూపిస్తాయి. మేఘాలయలో షిల్లాంగ్, చిరపుంజీ ప్రాంతాల్లో వర్షపు అడవులు, జలపాతాలు, మేఘాలతో కప్పబడిన కొండలు ఈ టూర్‌కు హైలైట్‌గా నిలుస్తాయి.
సైరాంగ్ రైల్వే స్టేషన్ ప్రత్యేక ఆకర్షణ
ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం మిజోరాంలో కొత్తగా ప్రారంభమైన సైరాంగ్ రైల్వే స్టేషన్. ఇది మిజోరాంలో తొలి రైలు గేట్‌వేగా గుర్తింపు పొందింది. పర్వతాల మధ్య, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ స్టేషన్ మీదుగా రైలు ప్రయాణం చేయడం జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అనుభూతిగా చెప్పవచ్చు. రైలు కిటికీ నుంచి కనిపించే దృశ్యాలు ప్రయాణికుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
భోజనం, వసతి, సౌకర్యాలు
ఈ టూర్‌లో ప్రయాణికులకు రోజుకు 3 సార్లు భోజనం అందిస్తారు. స్థానిక వంటకాలతో పాటు సాధారణ భారతీయ ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి నగరంలో నాణ్యమైన హోటళ్లలో వసతి ఏర్పాటు చేస్తారు. దర్శన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, గైడ్లు అందిస్తారు. కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు సైతం సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు ఉంటాయి.
ధర వివరాలు, బుకింగ్ సమాచారం
ఈ భారత గౌరవ్ నార్త్ ఈస్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్ ప్యాకేజ్ ధర ఒక్క వ్యక్తికి రూ.1,19,945 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, లోకల్ ట్రావెల్, దర్శనాలు అన్నీ కలిపి ఉంటాయి. బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజ్ కోడ్ CDBG35 ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. 16 రోజులు పాటు సాగిన ఈ భారత గౌరవ్ నార్త్ ఈస్ట్ ప్రయాణం సాధారణ టూర్ కాదు. ఒకే ప్రయాణంలో 7 రాష్ట్రాల ప్రకృతి అందాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, వన్యప్రాణులు అన్నింటిని చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. రైల్లోనే దేశాన్ని చూసే కలను నిజం చేసే ఈ టూర్, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగులుస్తుంది.