ఎండాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకులతో బస్సులు, రైళ్లు, ఇతర ట్రావెల్స్ వాహనాలు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ సమ్మర్ సీజన్ ఎంతో స్పెషల్. ఇలాంటి టైమ్ లో స్పెషల్ బస్సులు, ట్రైన్లు అందుబాటులోకి తెస్తుంటాయి ప్రభుత్వాలు. తాజాగా భారతీయ రైల్వే ఏపీకోసం కొన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతోంది. వీటి వివరాలు ఓసారి చూద్దాం.
మొత్తం ట్రైన్స్ 42
ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు స్పెషల్ ట్రైన్స్..
విశాఖపట్నం – బెంగళూరు
విశాఖ పట్నం – కర్నూలు
విశాఖ పట్నం – తిరుపతి రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.
విశాఖ నుంచి బెంగళూరుకి ఒక స్పెషల్ ట్రైన్ వేశారు. దీని నెంబర్ 08581/08582. ఈ ట్రైన్ విశాఖపట్నం-బెంగళూరు మధ్య 7 ట్రిప్పులు తిరుగుతుంది. అంటే మొత్తం 14 జర్నీలు అన్నమాట. విశాఖ నుంచి ప్రతి ఆదివారం ఈ రైలు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి ప్రతి సోమవారం తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ సమ్మర్ అయిపోయే వరకు అంటే మే -31 వరకు 7 వారాలపాటు అందుబాటులో ఉంటుంది.
మధ్యలో ఆగే స్టేజ్ లు.. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, జోలార్‌పేట్, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ కి స్టాపింగ్ ఉంది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపక్ క్లాస్ లతో పాటు.. జనరల్ బోగీలు కూడా అందుబాటులో ఉంటాయి.
విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం వైజాగ్ నుంచి మొదలవుతుంది. గురువారం తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ 08547/08548. విశాఖలో బయలుదేరితే మధ్యలో దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ కూడా వారానికి రెండు ట్రిప్పులు.. మొత్తంగా 14 ట్రిప్పులు తిరుగుతుంది.
ఇక విశాఖ నుంచి కర్నూలు సిటీ వరకు కూడా మరో ట్రైన్ అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్ విశాఖ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది. కర్నూరు చేరుకున్న తర్వాత బుధవారం రిటర్న్ జర్నీ ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ 08545/08546. ఈ ట్రైన్ విశాఖ స్టేషన్ లో బయలుదేరితే.. మధ్యలో దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది. వారానికి రెండు ట్రిప్పుల చొప్పున.. వేసవి పూర్తయ్యే వరకు మొత్తం 14 ట్రిప్పులు ఈ ట్రైన్ తిరుగుతుంది.
ఏపీలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్రం కూడా దానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. వేసవి పర్యాటకుల్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రభుత్వం ఈ ట్రైన్లను అందుబాటులోకి తేవడం విశేషం. అంతే కాదు, దీనిపై విస్తృత ప్రచారం కూడా కల్పిస్తోంది. ఈనెల 13 నుంచి ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు, ఏయే వారాల్లో ట్రైన్లు బయలుదేరతాయో కూడా ప్రకటించారు. అయితే టైమింగ్స్ విషయంలో తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. తిరుమల యాత్ర ప్లాన్ చేసుకునేవారు, బెంగళూరుకి విహారయాత్రకు ప్లాన్ చేసుకునేవారు, కర్నూలు ప్రాంతంలో దర్శనీయ స్థలాలకు వెళ్లాలనుకునేవారు ఈ ట్రైన్లను వినియోగించుకోవచ్చు. అదే సమయంలో ఏపీలోని ఇతర ప్రాంతాలనుంచి విశాఖకు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఈ ట్రైన్లు బాగా ఉపయోగపడతాయి. మరింకెందుకాలస్యం.. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ కి వెళ్లి.. ట్రైన్ నెంబర్లతో సెర్చ్ చేయండి.. మీ టూర్ ప్లాన్ ప్రకారం టికెట్లు బుక్ చేసుకోండి.