EV Sales Surge in Nalgonda: నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన, పన్నుల మినహాయింపుల కారణంగా ప్రజలు విద్యుత్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ-బైక్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడాది కాలంలో మొత్తం 11,115 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేశారు. వీటిలో ఈ-బైక్‌ల వాటా ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత ఈ-కార్లు ఉన్నాయి. ఈ-రిక్షాలు, గ్రీన్ ఆటోలు, ఇతర విద్యుత్ ఆధారిత వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండలో 5,227, సూర్యాపేటలో 3,338, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,550 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి.
రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో ఉపయోగపడటంతో ద్విచక్ర వాహనదారులు ఈ-బైక్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందనే భావన వినియోగదారుల్లో ఉంది. చిన్నపాటి వ్యాపారాలు, సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే ఈ-రిక్షాలు, ఇతర విద్యుత్ వాహనాల వినియోగం కూడా క్రమంగా విస్తరిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగడం ఒకవైపు కాలుష్య నియంత్రణకు ఉపయోగపడుతున్నప్పటికీ, రవాణాశాఖ ఆదాయంపై మాత్రం కొంత ప్రభావం చూపుతోంది. సాధారణ వాహనాల కొనుగోళ్లపై లైఫ్ టైమ్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్ లు, ఎంట్రీ ఫీజులు, సర్వీస్ ఛార్జీలు, గ్రీన్ ట్యాక్స్ లాంటి మార్గాల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కొన్ని విద్యుత్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఉండటంతో ఈ ఆదాయం తగ్గుతోంది. దీనికి తోడు బార్డర్ చెకింగ్ కేంద్రాలను తొలగించడం వల్ల జరిమానాలు, అక్రమ సరుకు రవాణా నియంత్రణ ద్వారా వచ్చే ఆదాయానికి కూడా గతంతో పోలిస్తే తగ్గింది.
ఈ మార్పుల మధ్య కూడా ఉమ్మడి జిల్లాలో రవాణాశాఖ ఆదాయం దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.362.26 కోట్లు ఆదాయం రాగా, 2025-26లో రూ.362.59 కోట్లు సమకూరాయి. ఆన్‌లైన్ సేవలను విస్తరించడం, వాహన పన్నులు, బకాయి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రవాణాశాఖకు ఆదాయం మాత్రమే లక్ష్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాహనదారులకు పారదర్శక సేవలు అందించడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణీత వేగాన్ని మించకుండా వాహనాలు నడపడం, రాత్రివేళ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకపోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యుత్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ ధోరణి కొనసాగితే రోడ్లపై ఈ-బైక్‌లు, ఈ-కార్లు, ఈ-రిక్షాలు మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
Read Also: 432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!