Best Scuba Diving Destinations in India: సముద్రం అంటే చాలామందికి గుర్తొచ్చేది అందమైన బీచ్‌లు, అలలు, సూర్యాస్తమయాలు మాత్రమే. కానీ, సముద్రం అడుగున మరో అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. రంగురంగుల చేపలు, అందమైన పగడపు దిబ్బలు, అరుదైన సముద్ర జీవులు.. వీటన్నింటినీ దగ్గరగా చూడాలంటే స్కూబా డైవింగ్ మంచి అవకాశం. భారత్ లో కూడా ఈ ఎక్స్ పీరియెన్స్ అందించే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. లక్షద్వీప్ నుంచి గోవా, కేరళ, పుదుచ్చేరి మీదుగా అండమాన్ వరకు అద్భుతమైన డైవింగ్ ప్రదేశాలు ఉన్నాయి. స్కూబా డైవింగ్ కోసం వెళ్లే ఆరు బెస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్కూబా డైవింగ్ కు భారత్ లో బెస్ట్ ప్లేసెస్ లో లక్షద్వీప్ ఒకటి. ఇక్కడి స్వచ్ఛమైన సముద్రపు నీరు, తెల్లటి ఇసుక తీరాలు, రంగురంగుల పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నీటి అడుగున పలు రకాల సముద్ర జీవులను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడికి వెళ్లేందుకు అవసరమైన అనుమతులను ముందుగానే తీసుకోవాలి. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
బీచ్ పార్టీలకు ప్రసిద్ధి చెందిన గోవా స్కూబా డైవింగ్‌కు కూడా మంచి డెస్టినేషన్. ముఖ్యంగా గ్రాండే ఐలాండ్ చుట్టుపక్కల డైవింగ్ కు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ సహజమైన పగడపు దిబ్బలతో పాటు పాత ఓడల శిథిలాలను కూడా చూడవచ్చు. ప్యారెట్ ఫిష్, మోరే ఈల్స్, స్టింగ్రే లాంటి సముద్ర జీవులు కనిపిస్తాయి. మొదటిసారి డైవింగ్ చేయాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
కేరళలోని కోవలం, కొచ్చి ప్రాంతాలు కూడా స్కూబా డైవింగ్ కు అనువైనవి. ఇక్కడ సముద్రపు అడుగున ఉన్న పగడపు దిబ్బలు, ఓడల శిథిలాలు, ఇతర డైవింగ్ ప్రదేశాలను అన్వేషించవచ్చు. డైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునే వారికి కూడా ఇక్కడ శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
తమిళనాడులోని రామేశ్వరం కేవలం ఆధ్యాత్మిక ప్రాంతంగానే కాకుండా వాటర్ స్పోర్ట్స్ కు కూడా ప్రసిద్ధి చెందుతోంది. ఇక్కడి పాల్క్ బే సముద్ర ప్రాంతంలో డైవింగ్ చేస్తే సముద్రపు గడ్డి మైదానాలు, విభిన్న సముద్ర జీవులను చూడవచ్చు.
పుదుచ్చేరి భారత ప్రధాన భూభాగంలోని ప్రముఖ డైవింగ్ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ నీటి అడుగున ప్రత్యేక నిర్మాణాలతో ఏర్పాటు చేసిన కృత్రిమ పగడపు దిబ్బలు ఉన్నాయి. కాలక్రమేణా ఇవి అనేక సముద్ర జీవులకు నివాసాలుగా మారాయి. శిక్షణ పొందాలనుకునే వారికి కూడా ఇది మంచి ప్రాంతం.
అండమాన్‌లోని హేవ్‌లాక్, నీల్ దీవులు స్కూబా డైవింగ్‌కు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ అనుభవం ఉన్నవారితో పాటు కొత్తగా డైవింగ్ నేర్చుకునేవారికి కూడా అనువైన ప్రదేశాలు ఉన్నాయి. పగడపు దిబ్బలపై తిరిగే తాబేళ్లు, రీఫ్ షార్క్ లు, ఆక్టోపస్‌లు, మోరే ఈల్స్ లాంటి సముద్ర జీవులను దగ్గరగా చూడవచ్చు.
Read Also: తాజ్ మహల్ లోకి ఫ్రీ ఎంట్రీ.. పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్!