Diamond and Gold Reserves in Nalgonda: నల్లగొండ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉందా? పలు ప్రాంతాల్లో అత్యంత విలువైన వజ్రాలు, బంగారం గనులు ఉన్నాయా? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. గత కొద్ది సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు నల్లగొండలోని పలు ప్రాంతాలను స్టడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో వజ్రాలు, బంగారు గనుల ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జియోఫిజిక్స్, జియాలజీ, జాగ్రఫీ, జియోకెమిస్ట్రీ విభాగాల శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశోధనలు నిర్వహించి, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ జర్నల్ పెట్రాలజీలో ప్రచురితమైనట్లు సమాచారం.
ఈ పరిశోధనలో భాగంగా కృష్ణా, హాలియా, మూసీ, కనగల్ నదుల పరివాహక ప్రాంతాలను పరిశోధకులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో వజ్రాలకు సంబంధించిన భౌగోళిక ఆనవాళ్లు కనిపించాయని గుర్తించారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఖనిజాల ఉనికిని సూచించే ఆధారాలు లభించినట్లు పరిశోధన పత్రంలో తెలిపారు. ముఖ్యంగా రామడుగు ప్రాంతంలో గుర్తించిన వజ్రాల గనుల లక్షణాలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రసిద్ధ వజ్రాల గనులతో పోలికలు కలిగి ఉన్నట్లు తేల్చారు. ఈ ప్రాంతంపై భవిష్యత్తులో మరింత లోతైన పరిశోధనలు జరపాలని భావిస్తున్నారు. అలాగే పెదవూర మండలంలో బంగారం నిల్వలు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి హాలియా, అక్కడి నుంచి మూసీ నది వరకు విస్తరించిన ప్రాంతాన్ని శాటిలైట్ ఫోటోల ఆధారంగా పరిశోధకులు సమగ్రంగా పరిశీలించారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో సేకరించిన చిత్రాలు, భూగర్భ నమూనాల పరీక్షలు, శిలల విశ్లేషణ సహా పలు అంశాలను లోతుగా అధ్యనం చేసి ఈ అంచనాలకు వచ్చారు. భూమిలోని ఖనిజాల ఉనికిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇక గతంలో భారత భూవిజ్ఞాన సర్వే సంస్థ (GSI) నిర్వహించిన సర్వేలు, ఏరో మాగ్నెటిక్ డేటా విశ్లేషణల్లో కూడా నల్లగొండ జిల్లాలో విలువైన ఖనిజాల ఉనికి కనిపించినట్లు తాజా పరిశోధనలో ప్రస్తావించారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ అధ్యయనం కూడా ఆ ఫలితాలకు బలాన్ని చేకూర్చేలా ఉందని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం గుర్తించినవి ప్రాథమిక స్థాయి ఆనవాళ్లు మాత్రమే. వాస్తవంగా భారీ స్థాయిలో వజ్రాలు, బంగారం నిల్వలు ఉన్నాయా? లేదా? అనేది తేలాలంటే మరిన్ని సర్వేలు, డ్రిల్లింగ్ పరీక్షలు, శాస్త్రీయ విశ్లేషణలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆ ప్రాంతాల్లో కమర్షియల్ గా గనుల తవ్వకాలు సాధ్యమవుతాయా ? లేదా? అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?