New York’s Million Trees Initiative: వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం లాంటి సమస్యలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరం చేపట్టిన ‘మిలియన ట్రీస్ న్యూయార్క్’ అనే కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది. 2007 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరం ఏకంగా 10 లక్షల చెట్లను నాటారు. ఈ కార్యక్రమం కోసం సుమారు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.
ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.. నగరంలో పచ్చదనాన్ని పెంచడం మాత్రమే కాదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, ప్రజలకు మరింత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్ సిటీ పార్క్స్ అండ్ రిక్రియేషన్ విభాగం, న్యూయార్క్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కలిసి ప్రారంభించాయి. నగరంలోని రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఖాళీ స్థలాలు, నివాస ప్రాంతాల్లో చెట్లను నాటారు. కేవలం అందంగా కనిపించేందుకు కాకుండా, చెట్లను నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలుగా భావించి ఈ ప్రణాళిక రూపొందించారు.
పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ భవనాలు, రహదారులు, గ్లాస్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వేడి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎక్కువ అయ్యింది. చెట్లు నీడను అందించడం ద్వారా ఈ వేడిని తగ్గించాలని భావించారు. అలాగే గాలిలోని కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అందుకే చెట్లను వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పనిచేసే సహజ ఆయుధాలుగా నిపుణులు భావించారు.
ఈ ప్రాజెక్ట్ లో మరో ముఖ్యమైన అంశం శాస్త్రీయ పరిశోధన. చెట్లు ఎక్కడ నాటితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించారు. జనాభా సాంద్రత, కాలుష్య స్థాయి, చెట్ల కొరత, ఉష్ణోగ్రతలు లాంటి అంశాలను పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేశారు. అలాగే ఏ ప్రాంతంలో ఏ జాతి చెట్లు పెరుగుతాయో కూడా శాస్త్రీయంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి కూడా పెద్దపీట వేశారు. వేలాది మంది స్వచ్ఛంద సేవకులు చెట్లు నాటడం, వాటికి నీరు పోయడం, సంరక్షించడం లాంటి పనుల్లో పాల్గొన్నారు. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంఘాలు, వ్యాపార సంస్థలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యాయి. దీంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగింది.
పచ్చదనం పెంచడం ద్వారా నగరాలను మరింత ఆరోగ్యకరంగా, చల్లగా, నివాసయోగ్యంగా మార్చవచ్చని ‘మిలియన ట్రీస్ న్యూయార్క్’ ప్రాజెక్ట్ నిరూపించింది. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలంటే ఇలాంటి హరిత కార్యక్రమాలు మరిన్ని నగరాల్లో అమలు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?