Big Tv Kissik Talks:ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీ టాక్ షోస్ పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఇప్పుడు మంచి ప్రేక్షకదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొత్తం 25 ఎపిసోడ్లు పూర్తి కాగా, ఇప్పుడు 26వ ఎపిసోడ్ కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ నటీమణి శ్రీలక్ష్మి (Srilakshmi )అతిధిగా విచ్చేశారు. అందులో భాగంగానే ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె.. తాను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను? ఇండస్ట్రీలోకి రాకముందు తన కుటుంబంలో చోటుచేసుకున్న పరిస్థితులు ఏంటి? తన తండ్రి ఎలా చనిపోయారు..? తన తండ్రి మరణం తర్వాత తన కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇలా ప్రతి విషయంపై కూడా ఆమె స్పందించారు.
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ..” హీరోయిన్ గానే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. కాకపోతే కమెడియన్గా సెటిల్ అవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి మా నాన్న ఒక పెద్ద స్టార్ హీరో.. ఆయన పేరు అమర్నాథ్.. అమర సందేశం, పిచ్చి పుల్లయ్య, వదిన గారి గాజులు, చెడపకురా చెడేవు ఇలా ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. కానీ ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు ఎస్వీ రంగారావు, సత్యనారాయణ రావు లాంటి వాళ్లు చేసినట్టుగా మా నాన్న క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయమన్నా సరే చేయలేకపోయారు. కారణం మా నాన్న సినిమా నిర్మించడమే.. హీరోగా చేస్తున్నప్పుడే నిర్మాతగా మారి.. ‘మగవారి మాయలు’ అని ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్లో సినిమా నిర్మించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మారడంతో ఆర్థికంగా మా ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ఇక ఆ బాధ నుంచి చేరుకోలేక పోయారు. అదే సమయంలో ఆయనకు జాండీస్ వచ్చింది. దాని నుంచి బయటపడలేక చనిపోయారు” అంటూ ఎమోషనల్ అయ్యారు శ్రీలక్ష్మి.
కుటుంబ పోషణ కోసమే ఇండస్ట్రీలోకి..
ఇకపోతే తన తండ్రి బ్రతికున్నప్పుడు తాను సినిమాలలోకి రాలేదు అని, కానీ తన తండ్రి మరణించాకే తాను సినిమాలలోకి వచ్చానని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి. అలా ఒకవైపు తండ్రి మరణం.. మరొకవైపు ఆస్తి కూడా కోల్పోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని, అందుకే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది.. వాస్తవానికి శ్రీలక్ష్మి తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు కాగా.. ప్రస్తుతం ముగ్గురు మున్నామంటూ ఆమె తెలిపింది. ఆ సమయంలో తన తండ్రి లేకపోవడంతో తల్లితోపాటు పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులు ఏడు మంది. ఇక వారందరి జీవనం కొనసాగాలి అంటే డబ్బు కావాలి. అందుకే నేను సినిమాల్లోకి వచ్చాను అంటూ కూడా తెలిపింది శ్రీలక్ష్మి.
తండ్రి పెట్టిన పేరే శాశ్వతంగా..
ఇకపోతే తన పేరు లక్ష్మి అయితే తన తండ్రి శ్రీ అని యాడ్ చేసి శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు అని, కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది తనను పేరు మార్చుకోమని ఇబ్బంది పెట్టారని, తాను మాత్రం తన తండ్రి పెట్టిన పేరును మార్చుకోకుండా ఎవరికి గుర్తింపు వస్తే వారే ఇండస్ట్రీలో నిలబడతారని గట్టిగా చెప్పానని.. నాడు అలా చెప్పడం ఏమో తెలియదు కానీ ఇప్పుడు తన పేరే ఇండస్ట్రీలో స్థిరంగా నిలిచిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ లక్ష్మీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ: OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!