Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు యమలోకంలో కూర్చుని ఉండగా నారదుడు వెళ్తాడు. ఆరును చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు ఈ బాలిక. నిత్యం పాపుల హాహాకారాలతో ఆర్తనాదాలతో శోక వికారాలతో దద్దరిల్లు ఈ నరకలోకంలో ఇంత ప్రశాంతంగా ధ్యానం చేయుచున్నది. యక్షినియా..? గాంధర్వ కాంతనా..? లేక నాగకన్యా..? లేదు లేదు.. చూచుటకు అతి సామాన్యమైన మానవ కాంతలా ఉన్నది. విషయం తెలుసుకుంటాను అనుకుంటూ దగ్గరకు వెళ్లి ఎవరు బాలిక నువ్వు అని అడుగుతాడు. దీంతో ఆరు తమరెవరు నరకలోకానికి ఆర్కెస్ట్రానా..? అని అడగ్గానే.. నారదుడు షాక్ అవుతాడు. నువ్వు ఆంగ్ల పదమును ఉచ్చరించావు అంటే కచ్చితంగా భూలోక వాసివే అయ్యి ఉంటావు.. అనగానే..
అవును నా పేరు అరుంధతి.. కేరాఫ్ భూలోకం అని చెప్తుంది. ఏమిటి తల్లి మీ లోకంలో చలనచిత్రములలో దూరదర్శన్ ధారావాహికలో మమ్ములను ఎప్పుడూ వీక్షించలేదా..? అని నారదుడు అడగ్గానే.. స్క్రీన్ మీద చాలా చూశాను.. సడెన్‌గా చూసే సరికి గుర్తు పట్టలేకపోయాను అగ్గిపుల్ల స్వామి అనగానే నారదుడు షాకింగ్ గా అదేంటి అగ్గిపుల్ల స్వామా..? అని అడుగుతాడు. దీంతో ఆరు అవును మా లోకంలో మీ పేరు అదే.. రెండు గ్రూపుల మధ్య తగువులు పెట్టి తమాషాలు చూస్తుంటారు కదా..? అంటుంది. దీంతో నారదుడు మీ లోకంలో మమ్ములను ఈ రకంగా ప్రాపగండ చేస్తున్నారా..? అంటాడు. అవును మీరు ఆ రకంగానే చాలా పాపులర్ అయ్యారు అని ఆరు చెప్తుంది. బాలికా మేము ఏం చేసిననూ లోక కళ్యాణం కోసమే కదా..? అని చెప్తుంటాడు.
ఇంతలో అటుగా వెళ్తున్న గుప్త, నారదుడిని చూసి షాక్ అవుతాడు. అమ్మో నారద మహర్షుల వారు అని భయపడతాడు. ఇంతకీ మానవ కాంతవైన నువ్వు ఇచ్చటికీ ఎటుల వచ్చితివి అని అడగ్గానే.. ఎటుల వచ్చితిని అంటే అందరూ చచ్చాక నరకానికే కదా వస్తారు అని చెప్తుంది ఆరు. దూరం చూస్తున్న గుప్త.. ఈ బాలిక మరణం ప్రభువుల వారి తప్పిదం అని నారద మహర్షులకు తెలిసినచో.. నరక లోకమునకే నరకం చూపించెదరు..అని భయపడుతుంటాడు. మరోవైపు నారదుడు నువ్వు మరణించి ఇక్కడికి వచ్చిన ఎడల రౌరమున శిక్ష అనుభవిస్తూ ఉండవలెను కదా..? ఇంత ప్రశాంతంగా ధ్యానం ఎలా చేస్తున్నావు.. అని అడుగుతుంటే.. గుప్త పరుగెత్తుకుంటూ వచ్చి నారద మహర్షులకు ప్రణామములు అంటాడు. నారదడు కూడా ప్రణామములు ఏం విచిత్ర గుప్త ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో గుప్త ఇప్పటి వరకు క్షేమమే మహర్షి.. తమ రాక వల్ల ఏమి జరుగునో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంటుండగా… ఏమిటో అంటున్నావు అని నారదుడు అడగ్గానే..
ఏమీయూ లేదు.. తమ దయ వల్ల అంతయూ కుశలమే అంటున్నాను.. అని చెప్పగానే.. నారదుడు ఎలా ఉన్నాడు మీ యమధర్మరాజు అని అడగ్గానే.. తమ కోరకే వేచి చూస్తున్నారు అని గుప్త చెప్తాడు.. దీంతో నారదడు అనుమానంగా అదేంటి మీ ప్రభువుల వారు ఎప్పుడూ వేచి చేసేది పాపులను శిక్షించుట కొరకే కదా..? అంటాడు నారదుడు. దీంతో ఆయన పాపులను మాత్రమే శిక్షించెదరు మీరు అందరినీ శిక్షిస్తారు అని మనసులో అనుకుంటుంటే.. మరలా ఏదో అంటున్నావు విచిత్రగుప్త అని నారదుడు అడగ్గానే.. ఏమీయూ లేదు మహర్షి.. అల్పాహారం ఏదైనా స్వీకరించెదవా అని అంటూ గుప్త చెప్పగానే.. ఇదేమైనా స్వర్గమా..? అమృతం స్వీకరించడానికి ఈ నరకమున చీము నెత్తురు తప్పా ఏమీ ఉండదు కదా గుప్త అంటాడు నారదుడు.. ఇంతలో ఆరు కల్పించుకుని అసలు వీళ్లకు అలాంటివేమీ ఉండవు.. దయాదాక్షిణ్యాలు అసలు లేవు అని చెప్తుంటే.. నారదడు చిత్ర విచిత్ర గుప్త ఈ బాలిక ఎవరు.? ఈమె కథ ఏంటి..? అని అడగ్గానే..గుప్త ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.