Google Chrome: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను వినియోగిస్తున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) క్రోమ్ డెస్క్‌టాప్ యూజర్లను అలర్ట్ చేసింది. ఇప్పటికే మనం ఉపయోగిస్తున్న పాత వెర్షన్‌లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటి కారణంగా యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడతాయని పేర్కొంది. దీంతో హ్యాక్లరు మీ బ్రౌజర్ లోపాలను ఆసరా చేసుకుని కీలక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో క్రోమ్‌ని వాడుతున్న యూజర్లు జాగ్రత్త పడాలని సూచించింది.
తాజా CERT-In నివేదిక ప్రకారం.. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాపుల్లో వినియోగించే క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్‌లో అనేక భద్రతా లోపాలు గుర్తించారు. ఈ వెర్షన్‌ను వాడుతున్న యూజర్ల పర్మిషన్ లేకుండానే హ్యాకర్లు.. యూజర్ల డేటామొత్తం తస్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే తాజా వెర్షన్‌కి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప్రకారం.. 142.0.7444.59 కంటే ముందున్న లైనక్స్, 142.0.7444.59/60 కంటే ముందున్న విండోస్, 142.0.7444.60 కంటే ముందున్న మ్యాక్ వెర్షన్ బ్రౌజర్లను వాడుతున్న యూజర్లు వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని.. లేకపోతే బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
బ్రౌజర్‌ని అప్డేట్ చేయాలంటే ముందుగా కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత కుడిభాగంలో పైన 3 చక్కలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే హెల్ప్ అనే మెనూ కనిపిస్తుంది. అందులో ఎబౌట్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా బ్రౌజర్ అప్డేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక రీలాంచ్ బటన్‌పై క్లిక్ చేయాలి. దాంతో బ్రౌజర్ క్లోజ్ అయి.. మళ్లీ ఓపెన్ అవుతుంది. దాంతో మీ బ్రౌజర్ అప్డేట్ అవుతుంది.