మావాడికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదు.. ఈ ముదురు బెండకాయ జీవితంలో పెళ్లి అనేదే రాసిపెట్టి లేదేమో అని తల్లిదండ్రులు తెగ ఫీలైపోతుంటారు. అలాంటివారి కోసం వెలిసిందే ఈ మ్యారేజ్ మార్కెట్. వినడానికి వింతగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. మన ఊర్లలో వారం వారం సంతలు ఏర్పాటు చేసినట్లే.. అక్కడ కూడా ఈ ‘పెళ్లి’ సంతలు ఏర్పాటు చేస్తుంటారు. పెళ్లికాని ప్రసాదుల తల్లిదండ్రులంతా ఆ రోజు అక్కడ కనిపిస్తుంటారు. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు క్రమం తప్పకుండా ఈ మార్కెట్‌కు వస్తారు. తమకు నచ్చితే.. అక్కడే పెళ్లి ఖాయం చేసుకుని వెళ్లిపోతారు. మీకు కూడా అక్కడికి వెళ్లాలని ఉంది కదూ. కానీ, చాలా కష్టం. ఎందుకంటే.. ఈ సంత చైనాలో ఉంది.
చైనాలోని షాంగై, బీజింగ్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ మ్యారేజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తారు. స్థానిక పార్కులే దీనికి వేదికలు. దేశంలో ఉన్న పెళ్లి బ్రోకర్లంతా ఇక్కడే ఉంటారు. వీటికి ఎలాంటి ఆన్‌లైన్ బుకింగ్స్ ఉండవు. మీకు పెళ్లి చేసుకొనే వయస్సు ఉంటే చాలు.. ఈ మార్కెట్లో అడుగుపెట్టవచ్చు. ఎక్కువగా ఇక్కడికి పెళ్లికాని యువతీయువకుల తల్లిదండ్రులే వస్తారు. ఇరు కుటుంబాలు ఇక్కడ నేరుగా ఫేస్ టు ఫేస్ సంబంధాలను సెట్ చేసుకుంటారు. దానివల్ల పెళ్లి ప్రాసెస్ చాలా వేగంగా ముగుస్తుంది.
చైనాలోని షాంగైలో పీపుల్స్ పార్కులో ఎక్కువగా ఈ మార్కెట్లను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ మార్కెట్లు తెరిచి ఉంటాయి. బీజింగులో జోంగ్షాన్, యుయాంతన్ వంటి ఫేమస్ పార్కుల్లో కూడా ఈ మార్కెట్లు చూడొచ్చు. అలాగే గ్వాంగ్‌జౌ, చెంగ్డు, హాంగ్‌జౌ, చోంగ్‌కింగ్ వంటి నగరాల్లో కూడా ఈ మార్కెట్లు ఉంటాయి. కొన్ని నగరాల్లో వారాంతంలో కాకుండా అన్ని రోజులు ఈ మార్కెట్లు తెరిచి ఉంటాయి.
ఎవరైనా పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తే.. అబ్బాయి లేదా అమ్మాయి ఫొటోలను తీసుకెళ్తారు. కానీ, ఇక్కడ అలా కాదు. వారి ఫొటోలతోపాటు కొన్ని సాంప్రదాయాలను పాటిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను రాసిన పేపర్లను వెంట తీసుకెళ్తారు. కొందరు అందమైన చేతి రాతతో ఆకట్టుకొనేలా తమ పిల్లల గురించి అందులో వివరిస్తారు. మరికొందరు ప్రింట్ చేసి తీసుకెళ్తారు. కొందరైతే గొడుగులకు పోస్టర్లు అతికించి మరీ తీసుకెళ్తారు. వాటిపై తమ బిడ్డ వయస్సు, ఎత్తు, విద్యార్హతలు, ఉద్యోగం, కంపెనీ పేరు, నెల జీతం వంటి వివరాలు రాస్తారు. కొందరు వారి ఆస్తుల వివరాలు కూడా పొందుపరుస్తారు. సొంత ఇల్లు, కారు, స్థలాల వివరాలను సైతం వివరిస్తారు. చివరిగా.. వారికి ఎలాంటి భాగస్వామి అవసరం అనే వివరాలను రాస్తారు. వారికి ఎంత వయస్సు ఉండాలి? ఎంత ఎత్తు ఉండాలి.. ఎలాంటి జాబ్ చేస్తుండాలి.. ఇలా పలు డిమాండ్లను రాస్తారు. వాటికి ఎవరైతే సెట్ అవుతారో.. వారిని సెలక్ట్ చేసుకుని.. నేరుగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పెళ్లి ఖాయం చేసుకుంటారు. కొందరు ఫోన్ నెంబర్లు మార్చుకుని.. తర్వాత మాట్లాడుకుంటారు.
పెళ్లి మార్కెట్ అనగానే.. యువతి యువకులు ఎగేసుకుని వెళ్తారేమో అని మనం అనుకుంటాం. కానీ, అక్కడ అలా జరగదు. కేవలం వారి పెద్దలు మాత్రమే ఆ మార్కెట్లకు వెళ్తారు. అయితే, వారి పిల్లలు వెళ్లకూడదనే రూల్ ఏమీ లేదు. తమ పిల్లలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటారనే కారణంతో పెద్దలే ఆ బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంతమంది ఆ మార్కెట్లకు వెళ్లాలంటే సిగ్గుపడతారు. ఈ మార్కెట్లో పార్టనర్ వెతికే పని పెద్దలదే. కానీ, తమ పిల్లలకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. వారికి అయిష్టంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోరు.
2004లో సీటీలోని పెద్దలంతా షాంగైలోని పార్కుల్లో కూర్చొని.. పెళ్లికాని తమ పిల్లల కోసం మాట్లాడుకొనేవారట. అయితే, కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల వారి సంఖ్య బాగా పెరిగిపోయిందట. పిల్లలకు పెళ్లి చేయడం పెద్ద సవాలుగా మారడంతో.. ఆ సమావేశాలు కాస్తా మార్కెట్లుగా మారిపోయాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా మ్యారేజ్ మార్కెట్లను నడుపుతున్నారు. అయితే, వీటికి పైసా డబ్బులు చెల్లించక్కర్లేదు. ఉచితంగానే అందరినీ సంప్రదించవచ్చు. అయితే, ఇలాంటి మార్కెట్లు మన ఇండియాలో ఎందుకు ఉండవు? అని అడగొద్దు. మన ఇండియాలో మార్కెట్ల తరహాలో కాకుండా.. కార్తీక మాసాల్లో ‘వనభోజనాలు’ పేరుతో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కులాలు, మతాలు ప్రతిపాదికన ఇవి జరుగుతుంటాయి.
Also Read: మరణం తర్వాత జరిగేది ఇదే.. 3 సార్లు చనిపోయి బతికిన మహిళ ఏం చెప్పిందంటే?