Viral Video : హైవేపై లాంగ్ డ్రైవ్. భలే మజా వస్తుంది. 11 మంది బైకర్లు గ్రూప్‌గా.. రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. దాదాపు అన్నీ రేసింగ్ బైక్‌లే. గేర్ మార్చితే గాల్లో తేలిపోయినట్టే. అలా మస్త్ మజాగా సాగుపోతున్న ఆ బైకర్లను.. సడెన్‌గా ఓ బ్లాక్ స్కార్పియో వెంబడించింది. బిగ్గరగా హారన్ కొడుతూ.. తరుముకొచ్చింది. బైకర్లకు భయమేసింది. మరింత స్పీడ్ పెంచారు. స్కార్పియో వదిలిపెట్టలేదు. మరింత ఎక్స్‌లేటర్ తొక్కారు. అలా హైవేపై సినిమాటిక్ ఛేజింగ్ జరిగింది. క్లైమాక్స్‌లో బిగ్ డ్యామేజ్ మిగిలింది. రూ.8 లక్షల స్పోర్ట్స్ బైక్ ధ్వంసం అయింది. ఒకరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నలుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే…
ఢిల్లీ, గుర్గావ్‌కు చెందిన 27 ఏళ్ల హార్దిక్ శర్మ. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 11 మంది ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ రైడింగ్ కోసం ఉదయం 7 గంటలకు బయలుదేరారు. ఖేర్కి దౌలా టోల్ ప్లాజా సమీపంలో ఓ బ్లాక్ స్కార్పియో వీళ్లను అడ్డగించింది. అందులోంచి నలుగురు దిగొచ్చి.. బూతులు తిడుతూ.. బైకర్లపై ఒక్కసారిగా దాడి చేశారు. బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టారు. ఆ దాడిలో హార్దిక్ శర్మ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆ నలుగురి కోపం చల్లారలేదు. శర్మకు చెందిన రూ. 8 లక్షలు ఖరీదు చేసే.. కవాసాకి Z900 స్పోర్ట్స్ బైక్‌ను ధ్వంసం చేశారు. బేస్ బాల్ బ్యాట్‌తో బైక్‌ను పగలగొట్టారు.
దాడి వీడియో వైరల్
దాడి చేసిన ఆ నలుగురు వ్యక్తులు కత్తులు చూపిస్తూ, చంపేస్తామని బెదిరించినట్టు బాధితుడు హార్దిక్ శర్మ చెబుతున్నారు. ఈ దాడి ఉదంతం మొత్తం.. బైకర్లలో ఒకరి వాహనంపై అమర్చిన GoPro కెమెరాలో రికార్డు అయింది. తన బైక్‌ను ధ్వంసం చేయొద్దని ఆ బైకర్ వేడుకుంటున్నా ఆ నలుగురు దుండగులు వదిలిపెట్టలేదు. కోపంతో బెదిరిస్తూ.. బైక్‌ను పగలగొడుతూనే ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
> Studied hard.
> Became software engineer.
> Buys his favourite bike.
> Goes on a ride with group.
> Gets beaten up by Gurgaon Dehatis.
> 11 lakh rupees bike destroyed.
> Admitted to ICU.Moral? Leave India if you earn well at a young age.pic.twitter.com/XLGxA5cswt
— Akshit (@CaptainGzb) April 22, 2025
పోలీసులు పట్టించుకోలేదా?
దాడి ఘటనతో దిగ్భ్రాంతి చెందిన బైకర్లు తేరుకున్నాక పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఆ టోల్ ప్లాజా ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో తెలుసుకోవడానికి వారికి 6 గంటలకు పైగా సమయం పట్టిందని బాధితుడు హార్దిక్ శర్మ ఆరోపించారు. టోల్ ప్లాజా దగ్గరే గంటసేపు వెయిట్ చేసినా.. పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోలేదని అన్నారు. చివరికి, సెక్టార్ 37 పోలీస్ స్టేషన్‌లో నేరపూరిత బెదిరింపు, ప్రాణాంతక ఆయుధాల వాడకం, ర్యాష్ డ్రైవింగ్, ప్రాణాలకు ముప్పు కలిగించడం, తప్పుడు నియంత్రణ తదితర అభియోగాలతో FIR నమోదు చేశారు పోలీసులు. బాధితులను వైద్య పరీక్షలు, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను గుర్తించి, పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బైకర్లపై ఎందుకు దాడి చేశారు?
ఇంతకీ బైకర్లపై ఆ నలుగురు ఎందుకు దాడి చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఆ 11 మంది బైకర్ల బృందం స్కార్పియోను ఓవర్‌టేక్ చేసి ఉంటారని అంటున్నారు. ఆ సమయంలో ఓ బైకర్‌కు.. ఆ స్కార్పియో వాళ్లకు అసభ్య సంజ్ఞ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కోపంతో ఆ స్కార్పియో వాళ్లు.. బైకర్ల బృందాన్ని ట్రేస్ చేసి.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ కింద వారిని అడ్డగించారని తెలుస్తోంది. తమను ఓవర్‌టేక్ చేసిన బైకర్ ఎవరో గుర్తుపట్టడానికి వారి హెల్మెట్స్ కూడా తీసేయించారట. అతనెవరో కనుక్కోలేక.. ఆ కోపంతో దొరికిన బైకర్లు అందరినీ కొట్టారని.. ఓ స్పోర్ట్స్ బైక్‌ను ధ్వంసం చేశారని తెలుస్తోంది.