Anantapur News: ఈ మధ్యకాలంలో కొందరు మహిళా అధికారులు వార్తల్లోకి వస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. పట్టరాని కోపంతో సంబంధిత వ్యక్తుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆఫీసుపై అటెండర్‌పై దురుసుగా ప్రవర్తించారు ఓ సీఐ. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. దీని వెనుక అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను ఆఫీసు అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపింది. రెండురోజుల కిందట జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా అమ్మినవారి నుంచి సదరు అధికారి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణకు వచ్చారు. ఎక్సైజ్ సీఐ హసీనా భాను- అటెండర్ మధ్య వాగ్వాదం జరిగింది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తావా అంటూ అటెండర్‌ని కొట్టారు. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అయితే ఈ విషయమై తనకేమీ తెలియదని అటెండర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అతడితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. ఆపై ఆగ్రహానికి లోనయ్యారు సీఐ హసీనా భాను. వెంటనే తన చెప్పు తీసుకుని అటెండర్‌ను లాగి పెట్టి కొట్టారు. దీనికి సంబంధించి అదే సమయంలో ఆఫీసులో ఉన్న ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించారు.
ALSO READ: ఊళ్లలోకి వచ్చిన సింహాన్ని పట్టుకుని కట్టేసిన గ్రామస్తులు
ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో సీఐ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. ఆమె వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఆమె అక్రమాలపై ఓ ఉన్నతాధికారి విచారణ చేపట్టినా ఎలాంటి ఫలితం లేదని అంటున్నారు.
గతంలోకి వెళ్తే..
తన చర్యలతో వివాదాస్పదమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్. రెండేళ్ల కిందట జనసేన నేత సాయి చెంప చెళ్లుమనిపించింది.ఈ విషయాన్ని జనసేన పార్టీ సీరియస్‌గా తీసుకుంది. సీఐ అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అధినేత. ఈ విధంగా కొందరు మహిళా అధికారులు ఈ విధంగా వివాదాల్లోకి చిక్కుకుంటున్నారు.
వివాదంలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ
అటెండర్ ను చెప్పుతో కొట్టిన సీఐ హసీనా భాను
తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పై ఆగ్రహం
తనకేం తెలియదని చెబుతున్నా వినకుండా అటెండర్ ను కొట్టిన హసీనా భాను
అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ లో రెండు రోజుల క్రితం ఈ ఘటన… pic.twitter.com/1dYVIxbJVU
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2025