Viral News: కుమార్తె పెళ్లి కోసం దాచిన 25 తులాల బంగారు నగలు.. అనుకోకుండా చెత్తలో పడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. కానీ అదృష్టవ వశాత్తు ఆ నగలు ఒక నిజాయితీగల పారిశుధ్య కార్మికురాలి చేతికి చేరి, తిరిగి బాధితురాలి చేరడంతో ఈ కథ చివరికి సుఖాంతమైంది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, మధురై కార్పొరేషన్ పరిధిలోని 75వ వార్డు సుందరరాజపురం న్యూ రైస్ మిల్ రెండో వీధిలో.. తంగం (52) అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో తమ కూతురు వివాహం జరగనుంది. కుమార్తె భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న 25 తులాల బంగారు నగలను ఆమె ఒక చిన్న దిండులో దాచుకుని, భద్రంగా ఉంచుకుంది.
వివాహ శుభకార్యాలు దగ్గరపడుతుండటంతో.. ఇంట్లో శుభ్రత పనులు చేపట్టారు. ఆ రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఇంట్లోని పాత సామాగ్రి, పనికిరాని బట్టలు, కాగితాలు తీసి సమీపంలోని మున్సిపల్ చెత్త డబ్బాలో వేశారు. ఆ తొందరలోనే బంగారు నగలు దాచిన దిండును కూడా ఎవరికీ తెలియకుండా చెత్తతో పాటు పారేశారు.
మరుసటి రోజు ఉదయం నగలు దాచిన దిండు కోసం మహిళ వెతకడం ప్రారంభించింది. ఇల్లంతా గాలించినా దిండు కనిపించలేదు. ఆందోళనతో కుటుంబ సభ్యులను అడగగా, వారు ఆ దిండును చెత్తతో పాటు బయట పారేశామని చెప్పడంతో తంగం ఒక్కసారిగా కుప్పకూలినట్టైంది. క్షణాల్లోనే ఆమె కళ్ల ముందు తన కుమార్తె పెళ్లి కలలన్నీ చెరిగిపోయినట్లై తీవ్రంగా విలపించింది.
తక్షణమే ఆమె ఇంటి సమీపంలోని చెత్తబుట్ట వద్దకు వెళ్లి వెతికింది. కానీ అప్పటికే చెత్తను మున్సిపల్ వాహనం తీసుకెళ్లడంతో అక్కడ ఏమీ కనిపించలేదు. దిక్కుతోచని స్థితిలో తంగం 75వ వార్డు హెల్త్ సూపర్‌వైజర్ అయిన మరుతు పాండియన్‌ను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించింది. విషయం తెలుసుకున్న ఆయన తక్షణమే స్పందించి, ఆ రోజు చెత్తను సేకరించిన పారిశుధ్య కార్మికురాలికి ఫోన్ చేసి, వివరాలు కనుక్కొన్నారు.
చెత్తను వేర్పాటు చేసే సమయంలో ఒక చిన్న దిండు తనకు తగిలిందని, దాన్ని తెరిచి చూడగా లోపల బంగారు నగలు కనిపించాయని పారిశుధ్య కార్మికురాలు మీనాక్షి తెలిపింది. నగలను చూసిన వెంటనే ఆమె వాటిని యథావిధిగా భద్రపరచి, విషయం తన పై అధికారులకు తెలియజేసింది. ఆ తర్వాత మీనాక్షి ఆ నగలను తీసుకుని హెల్త్ సూపర్‌వైజర్ మరుతు పాండియన్ కార్యాలయానికి చేరుకుంది.
మహిళ ఎదుటే నగలను పరిశీలించి అవి ఆమెవేనని నిర్ధారించుకున్న అధికారులు, 25 తులాల బంగారు నగలను పూర్తిగా ఆమెకు అప్పగించారు. నగలు తిరిగి దక్కడంతో ఆమె కుటుంబమంతా ఊపిరిపీల్చుకుంది. కుమార్తె వివాహం కోసం చేసిన ఏర్పాట్లకు ఇక ఎలాంటి అడ్డంకి లేదని వారు తెలిపారు.
నిజాయితీగా వ్యవహరించిన పారిశుధ్య కార్మికురాలు మీనాక్షి.. తగిన సమయానికి అధికారులను సంప్రదించడం వల్లే ఈ విలువైన బంగారం అసలు యజమానురాలికి చేరిందని స్థానికులు ప్రశంసలు కురిపించారు. అలాగే వేగంగా స్పందించిన వార్డు హెల్త్ సూపర్‌వైజర్ మరుతు పాండియన్‌ను కూడా ప్రజలు అభినందించారు.