Video Viral: పట్టపగలు ఆటోలో ఓ మహిళను దోచుకోవడానికి ప్రయత్నించారు దొంగలు. ఆటోడ్రైవర్ల వేషంలోవున్న దొంగల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఓ మహిళ భారీ పోరాటం చేసింది. యాక్షన్ మూవీని తలపించేలా జరిగింది. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
పంజాబ్‌లోని జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఫిల్లౌర్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే అందులో ఉన్నది దొంగలని గ్రహించలేకపోయింది. ఆటో కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఆమెని బెదిరించి నగలు, నగదు దోచుకునే ప్రయత్నం చేశారు.
ఆటో వెళ్తుండగానే మహిళ-ముగ్గురు దొంగల మధ్య ఫైట్ జరిగింది. అప్పటికే ఆమె నుంచి నగదు, నగలు దోచుకున్న దుండగులు ఆమెని ఆటో నుంచి బయటకు గెంతేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఏ మాత్రం పట్టు వీడలేదు. ఆటో వెనుక వాహనాలు కంటిన్యూగా వస్తున్నాయి. ఆటో వదిలేస్తే వాహనాల కిందట పడి తాను చనిపోతానని భావించింది. తనలోని వీరనాటిని బయటకు చూపించింది.
ఓ వైపు దుండగులను ఎదుర్కొంటూ మరోవైపు ఆటో నుంచి వేలాడుతూ సాయం కోసం అరవడం మొదలుపెట్టింది. దాదాపు అర కిలోమీటరు వరకు ఆటోలో వేలాడుతూ సాయం కోసం పిలుస్తూనే ఉంది. వెనుక కారులో ప్రయాణిస్తున్న కొందరు, ఆటోని వెంబడించారు. జరుగుతున్న తతంగాన్ని వీడియో తీశారు. ఆ క్రమంలో ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టి బోల్తా పడింది.
చివరకు దొంగలను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకడు పరారయ్యాడు. ఆ మహిళ ఆటో బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి మాంచి స్పందన వస్తోంది. మహిళ తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను పట్టించగలిగిందని అంటున్నారు. మహిళల పోరాటానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp
— Divya Goyal (@divya5521) September 10, 2025