ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తాజాగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరపుకున్నారు. అద్భుతంగా బాణాసంచా కాల్చుతూ సంతోషంలో ముగినిపోయారు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ సహా పలు దేశాల్లోని ఇండియన్స్ ఘనంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. అందులో భాగంగానే దుబాయ్ లోనూ దీపావళి వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. కళ్లు చెదిరేలా క్రాకర్స్ పేల్చినట్లు కనిపించింది. ముస్లీం దేశంలోనూ హిందూ పండుగ ఇంత ఘనంగా జరుగుతుందా? అని చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ యూజర్ విష్ణు సురేంద్రన్ అక్టోబర్ 20న కొన్ని వీడియోను షేర్ చేశాడు. ‘దుబాయ్‌లో దీపావళి’ అంటూ తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. సుమారు మిలియన్ వ్యూస్ సంపాదించింది. మరికొంత మంది కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈసారి దుబాయ్ లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయని చెప్పుకొచ్చారు.
అయితే, కొంత మంది నెటిజన్లకు ఈ దుబాయ్ దీపావళి వేడుకలపై అనుమానం కలిగింది. దీపావళి పండుగకు ఈ స్థాయిలో బాణాసంచా కాల్చారా? అని ఆలోచించారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి అనుమానం నిజం అయ్యింది. ఇవి దీపావళి వేడుకలు కాదని తేలిపోయింది. డిసెంబర్ 2, 2024న అప్ లోడ్ చేసిన UAE జాతీయ దినోత్సవం వేడుకలకు సంబంధించిన వీడియోలు అని తేలింది. UAE ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకుంటారు.
అటు దీపావళి వేడుకలు అని చెప్పే ఈ వీడియోల్లో డిసెంబర్ 3, 2024న అప్ లోడ్ చేసిన మరొక వీడియో కూడా కనిపించింది. ఇందులో ‘52 సంవత్సరాల UAE జాతీయ దినోత్సవం’ అనే బోర్డులు కూడా కనిపించాయి. 52వ నెంబర్ ను కలిగి ఉన్న లైట్ ఇన్‌స్టాలేషన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వీడియోలను UAEలోని అబుదాబిలో ఉన్న కార్నిచ్ స్ట్రీట్ ను చూపించింది. ఇక్కడ ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. పెద్ద మొత్తంలో లైటింగ్, అద్భుతంగా బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటారు. మొత్తంగా ఫ్యాక్ట్ చెక్ లో తేలిన విషయం ఏంటంటే.. సౌదీ అరేబియా, దుబాయ్ లో బాణసంచాతో దీపావళిని జరుపుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తిగా తప్పుదారి పట్టించే వీడియోలు అని తేలిపోయింది. ఈ వీడియోలు UAE జాతీయ దినోవత్సవానికి చెందినవి అని వెల్లడయ్యింది.
Read Also: దీపావళి రోజు ‘కార్బైడ్ గన్’తో ఆటలు.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారు!