తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవిపై ఏప్రిల్ 24వ తేదీ రాత్రి నలుగురు యువకులు హత్యాయత్నం చేశారని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న వేము నవీన్ పోలీసులకు దొరకలేదు. చేబ్రోలు జాన్ విక్టర్, దోమా రాకేష్ , షేక్ బాబులాల్‌లను ఏప్రిల్ 27వ తేదీ రాత్రి అరెస్టు చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంటే అరెస్టు చూపిన రెండురోజుల ముందే అదుపులోకి తీసుకుని.. ఏప్రిల్ 25న ముగ్గురు నిందితులను.. తెనాలి జయప్రకాష్‌నగర్‌లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే.. నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. మూడు రోజుల పాటు దళిత, మైనార్టీ యువకులను అదుపులో ఉంచుకుని తెనాలి వీధులన్నీ తిప్పుతూ విచక్షణారహితంగా.. కొట్టినట్లు కొందరు చెబుతున్నారు. టూ టౌన్ సీఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కిపెడితే.. త్రీ టౌన్ సీఐ రమేష్‌బాబు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసులో నిందితులు రిమాండులో ఉన్నారు.
తెనాలి పోలీసుల కోటింగ్‌పై స్పందించారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. అయితే పోలీసులపై పోలీసులపై దాడి చేయటం ఖండించదగ్గ విషయమన్న ఎస్పీ.. పోలీసులు నిందితులను కొట్టిన ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అందరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని మాత్రం తెలిపారు. ఆయన ప్రకటన చూస్తుంటే.. శాఖపరంగా పోలీసులకే సపోర్ట్ చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు పోలీసుల తీరుపై భగ్గుమంటున్నాయి ప్రజా సంఘాలు. పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు నేతలు.
Also Read: పౌర్ణమి ముందు రోజు ఊరంతా ఖాళీ.. తల్లి శవంతో నృత్యం చేసే కొడుకులు!
ఇక ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ రియాక్టయ్యారు. ఏపీ ప్రభుత్వ తీరుపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘిస్తోందని..పోలీసులను చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తోందని ఆరోపించారు.తెనాలిలో యువకులను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైసీపీ బాస్.