ప్రపంచ దేశాల్లో ప్రజలకు టీవీ చూడటం ఒక సాధారణ వినోదం. ఇష్టమైన ఛానెల్లు, సినిమాలు, సీరియళ్లు, వార్తలు ఇలా ఎన్నో కార్యక్రమాలు స్వేచ్ఛగా చూస్తారు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ టీవీ చూడటానికే కఠిన నియంత్రణలు ఉన్నాయి. ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రజల సమాచారంపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉంటుంది. టీవీ ప్రసారాలు కూడా ఇదే నియంత్రణలో ఉంటాయి. దేశంలో ప్రసారమయ్యే ఛానెళ్లు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తాయి. ప్రజలు తమ ఇష్టానుసారం ఛానెళ్లు మార్చుకునే అవకాశం చాలా తక్కువ. ప్రభుత్వం అనుమతించిన కొద్ది ఛానెళ్లు మాత్రమే టీవీలో కనిపిస్తాయి.
ఇతర దేశాల్లో కేబుల్ లేదా డిష్ ద్వారా వందలాది ఛానెళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ ఉత్తర కొరియాలో విదేశీ ఛానెళ్లు పూర్తిగా నిషేధం. ప్రజలు ఇతర దేశాల వార్తలు లేదా వినోద కార్యక్రమాలు చూడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. అందుకే టీవీ సెట్లను కూడా ప్రత్యేకంగా మార్చి విదేశీ సిగ్నల్స్ అందకుండా చేస్తారు. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే విధానం.
టీవీ రిమోట్ ఉన్నా వేస్ట్
టీవీ రిమోట్ ఉన్నప్పటికీ ఛానెళ్లు మార్చే స్వేచ్ఛ ఎక్కువగా ఉండదు. ముందే ఫిక్స్ చేసిన కొన్ని ఛానెళ్లు మాత్రమే ఉంటాయి. కొత్త ఛానెళ్లు జోడించడం లేదా విదేశీ ప్రసారాలు పెట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో ప్రజలు ప్రభుత్వ ప్రచారం, దేశీయ వార్తలు, ప్రభుత్వ కార్యక్రమాలనే ఎక్కువగా చూడాల్సి వస్తుంది. విదేశీ సినిమాలు, డ్రామాలు, టీవీ షోలు చూడడం మాత్రమే కాదు, వాటి గురించి మాట్లాడడం కూడా పెద్ద నేరంగా పరిగణిస్తారు. పెన్ డ్రైవ్‌లు, డీవీడీలు లేదా ఇతర మార్గాల్లో విదేశీ కంటెంట్ పంపిణీ చేస్తే కఠిన శిక్షలు తప్పవు. ఇది అక్కడ సమాచార నియంత్రణ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది.
Also read: Dog and Cancer: వాసన చూసి క్యాన్సర్ కనిపెట్టిన పెంపుడు కుక్క, దంపతుల ప్రాణాలు దక్కాయి
ఉత్తర కొరియాలోని నాయకత్వం ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే మీడియా, ఇంటర్నెట్, టీవీ వంటి సమాచార మార్గాలపై కఠిన నియంత్రణ సాగుతోంది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఈ నియంత్రణ మరీ కఠినంగా మారింది. ప్రజలకు వినోదం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక IPTV సేవను కూడా ప్రారంభించింది. దీనిని మాన్‌బాంగ్ అని పిలుస్తారు. ఇది ఒక విధంగా ఆన్‌లైన్ టీవీ ప్లాట్‌ఫారమ్ లాంటిదే. అయితే ఇందులో కూడా ప్రభుత్వానికి అనుకూలమైన కార్యక్రమాలు, విద్యా వీడియోలు, దేశీయ కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ కంటెంట్ ఇందులో ఉండదు.
అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్తర కొరియాలో సమాచార స్వేచ్ఛ చాలా తక్కువని చెప్పింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి నివేదికల్లో విదేశీ మీడియాపై నిషేధం, సమాచార నియంత్రణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రజలకు ప్రపంచ సమాచారం అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో స్మగ్లింగ్ ద్వారా కొందరు విదేశీ సినిమాలు, సీరియళ్లు చూసే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తుంటాయి. అయినప్పటికీ అది ప్రమాదకరమైన పని కావడంతో ఎక్కువ మంది ప్రజలు అలాంటి ప్రయత్నాలు చేయడానికి భయపడుతుంటారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో టీవీ వినోదం ఒక సాధారణ స్వేచ్ఛగా ఉంటే, ఉత్తర కొరియాలో అది ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వ్యవస్థగా మారింది. ప్రజలు చూసే సమాచారాన్ని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల అక్కడ మీడియా స్వేచ్ఛ పరిమితంగానే ఉంది. టీవీపై ఉన్న ఈ కఠిన నియంత్రణలు ఉత్తర కొరియాను చెడ్డ దేశంగానే చూపిస్తున్నాయి.