విలాసవంతమైన జీవితాల్ని ఇష్టపడే కోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఖరీదైన ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకటి ఖరీదైన పెర్ఫ్యూమ్. దీని ఖరీదు అక్షరాల 10 కోట్ల రూపాయలకు పైగా. మీరు ఈ పెర్ఫ్యూమ్ కొనాలంటే దుబాయ్ వెళ్లాల్సిందే. ఈ పెర్ఫ్యూమ్ పేరు షుముఖ్. ఇది కావాలంటే ముందుగా ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకోవాలి. ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే తయారు చేశారు.
ఎంత కష్టపడి తయారుచేశారో
దుబాయ్ ప్రపంచంలోనే విలాసవంతైన దేశంగా గుర్తింపు పొందింది. అక్కడ తయారయ్యే వస్తువులు కూడా ఖరీదుగానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఖరీదైన పెర్ఫ్యూమ్ తయారు చేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఈ తయారీలో 494 ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ పెర్ఫ్యూమ్ తయారయింది.
షుముఖ్ పెర్ఫ్యూమ్ మూడు లీటర్ల మురానో గాజు సీసాలో లభిస్తుంది. దీనిపై 3,571 వజ్రాలు, రెండున్నర కిలో గ్రాముల 18 క్యారెట్ల బంగారం, అయిదున్నర కిలో గ్రాముల స్వచ్ఛమైన వెండి, ముత్యాలు వంటివన్నీ నిండి ఉంటాయి.
షుముఖ్ అంటే అత్యున్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అర్హత కలిగినది అని అర్థం. అందుకే దీని ఖరీదు కూడా కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా బిలియనీర్లు మాత్రమే వాడగలిగే స్థాయిలో దీని ధర నిర్ణయించారు. దీని తయారీలో గంధపు చెక్క, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు, అంబర్ వంటి ఎన్నో వస్తువులను కలిపి ఈ పెర్ఫ్యూమ్ ను తయారు చేశారు. అలాగే అక్కడ దొరికే టర్కిష్ గులాబీలు, యాంగ్లూ యాంగ్లూ వంటి పూలతో కలిపి దీని తయారు చేశారు.
దీని సువాసనకు ఎవరైనా మైమరిచిపోవాలి. ఇప్పటికే ఈ పెర్ఫ్యూమ్ రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించింది. ఒకటి పెర్ఫ్యూమ్ బాటిల్ పై అత్యధిక వజ్రాలు కలిగి ఉన్నందుకు, ఇంకొకటి రిమోట్ కంట్రోల్ పెర్ఫ్యూమ్ స్ప్రే సిస్టంగా రికార్డ్ సాధించింది.
దుబాయిలో పెర్ఫ్యూమ్ మార్కెట్ అధికం. ఇప్పుడే కాదు ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి దుబాయిలో వ్యక్తిగత సువాసనలకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అక్కడే ఇలాంటి విలువైనవి కోట్లలో ఖర్చుపెట్టి తయారు చేస్తారు. దీన్ని ఎవరు కొంటున్నారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దుబాయ్ షాపింగ్ మాల్ లో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికే ఎంతోమంది దాన్ని కొనేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అది అమ్ముడుపోతే ప్రకటన ద్వారా ఎవరు కొన్నారో తెలియజేస్తారు.