అంతరిక్షంలోకి వెళ్లే అరుదైన అవకాశం అందరికీ రాదు. మనుషులు భూమిని దాటి వెళ్లే కొద్దీ వారి శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల వారి శరీరమే వారికి తేలికగా అనిపిస్తుంది. అలాంటి అనుభూతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వ్యోమగాములకు మాత్రమే అవకాశం దక్కుతుంది. మీరు భూమిపై చేసే ఎన్నో పనులను అంతరిక్షంలో చేయలేరు. ఏ ఏ పనులు చేయలేరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కన్నీరు పెట్టలేరు
భూమిపై ఉన్నప్పుడు కన్నీరు పెట్టుకుంటే ఆ నీరు జలజలా కంటి నుండి కిందకు రాలిపోతుంది. కానీ అంతరిక్షంలో ఉన్నప్పుడు మీరు ఏడవలేరు. కన్నీళ్లు కిందకి జారాలంటే గురుత్వాకర్షణ శక్తి అవసరం. ఆ శక్తి లేకపోవడం వల్ల కన్నీళ్లు కళ్ళల్లోనే ఉండిపోయి.. ఒక పొరలాగా బుడగలాగా ఏర్పడతాయి. అందుకే ఏడుపు వస్తే అక్కడ కంట్రోల్ చేసుకోవాలి, తప్ప ఏడవకూడదు. లేకుంటే కళ్ళ చుట్టూ నీటి పొరలు ఏర్పడి చికాకును కలిగిస్తాయి. వ్యోమగాములకు కన్నీరు వస్తే చేత్తోనే మెల్లగా కంటి నుండి తొలగించుకోవాలి. అందుకే వారు దాదాపు ఏడవకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు.
టాయిలెట్ వెళ్లలేరు
అంతరిక్ష నౌకలో కూడా టాయిలెట్ ఉంటుందా అని ఎంతోమంది సందేహం పడుతూ ఉంటారు. అంతరిక్ష నౌకలో టాయిలెట్ ఉన్నా కూడా గురుత్వాకర్షణ శక్తి ఆ వ్యర్థ పదార్థాలను కిందకి పడేలా చేయదు. అంతరిక్షంలోని టాయిలెట్లు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి. గాలి పీడనాన్ని ఉపయోగించి ఆ వ్యర్ధాలను ప్రత్యేక కంటైనర్ లోకి లాగుతాయి. ద్రవ వ్యర్థాలకు ఒకలా, ఘన వ్యర్థాలకు ఒకలా ఈ వ్యవస్థ ఉంటుంది. టాయిలెట్ సీట్ పై కూర్చోవాలన్నా కూడా కష్టమే. అందుకే కూర్చున్న తర్వాత గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి వ్యోమగాములు పైకి లేచిపోతూ ఉంటారు. అందుకే టాయిలెట్ సీట్ పై కూర్చున్నాక సీల్టు బెల్ట్ ని కట్టుకోవాల్సి వస్తుంది.
స్నానం చేయరు
అంతరిక్షంలో స్నానం చేయడం సాధ్యంకాని పని. ఎందుకంటే నీరు కిందకు ప్రవహించదు. గాలిలో తేలుతుంది. అందుకే అక్కడ నీటితో స్నానం చేసే పద్ధతి ఉండదు. బాడీ వైప్స్ తో శరీరాన్ని శుభ్రపరచుకుంటారు. అలాగే ప్రత్యేకమైన షాంపూలతో తలని రుద్దుకుంటారు. అంతకుమించి అక్కడ స్నానం చేయడం కుదరదు.
నిద్ర ఎక్కడ?
అంతరిక్షంలో ఎలాంటి ప్రత్యేక బెడ్ రూమ్‌లు ఉండవు. వ్యోమగాములు క్యాబిన్ గోడలు, పైకప్పులకు వేలాడుతున్న స్లీపింగ్ బ్యాగుల్లోనే నిద్రించాలి. గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి అవి తేలుతూ ఉంటాయి. కానీ అంతరిక్షంలో శరీరంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి నిద్ర ప్రశాంతంగా పడుతుందని వ్యోమగాములు చెబుతూ ఉంటారు.
భూమిపై ఉన్నప్పుడు ఆహారం తిన్నాక మనకి తేనుపులు రావడం సహజం. అలాగే అంతరిక్షంలో కూడా వస్తుంది. కానీ అది కొంచెం ప్రమాదకరంగా మారుతుంది. దాదాపు ఆ తేనుపులను బయటికి రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు.
అంతరిక్షంలో భూమిపై నడిచినట్టు త్వరగా నడవడం కుదరదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల గాలిలో తేలుతూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. వ్యోమగాములు కాళ్లతోనే ఒక ప్రదేశం నుండి బలంగా ముందుకు తోసుకుంటూ వెళతారు.
బట్టలు ఉతకలేరు
అంతరిక్షంలో బట్టలు ఉతకడం వంటివి చేయలేని పని. అందుకే వారు ఒకే బట్టలను ఎక్కువ రోజులు వేసుకుంటారు. వాటిని వ్యర్థ పదార్థాల్లాగా పారవేస్తారు. అంటే ఒక కంటైనర్లో ఒక కంటైనర్ లో వేసి నిల్వ చేస్తారు. వాటిని భూమికి తీసుకొచ్చి పడేస్తారు.