Top 10 abusive states: మన దేశంలో కొన్ని విషయాలు బయటపెడితే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాటలు, సంభాషణల తీరు కూడా అలాంటిదే. మనం రోజూ మాట్లాడుకునే మాటల్లో అసభ్య పదాలు ఎంతగా కలిసిపోయాయో మనకే తెలియదు. కొంతమంది స్నేహంగా అంటారు, ఇంకొంతమంది కోపంలో అంటారు. కానీ బూతుల భాష ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇలాంటిదే ఇటీవల దేశవ్యాప్తంగా ఓ సర్వే జరిగింది.
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, ఊర్ల నుంచి మెట్రో నగరాల వరకు.. ఎవరు ఎక్కువగా అసభ్య పదాలు మాట్లాడతారు అన్నదానిపై ఓ విస్తృతమైన అధ్యయనం జరిపారు. ఇంట్లో, వీధుల్లో, పని చేసే ప్రదేశాల్లో, స్కూల్స్‌లో మాట్లాడే భాషలో తిట్లకు ఎంత స్థానం ఉందో తెలుసుకోవడానికి వేలాది మందిని ప్రశ్నించారు. ఈ అధ్యయన ఫలితాలు చూస్తే నిజంగా తల దించుకునే పరిస్థితి.
మనం ఊహించని రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండగా, కొన్ని మృదువుగా ఉండే రాష్ట్రాలు అగ్రస్థానాల్లోకి వచ్చాయంటే షాక్ తప్పదు. మరి దేశంలో బూతులు భాష ఎక్కువగా వినిపించే టాప్ 10 రాష్ట్రాలు ఏవో తెలుసా? ఈ జాబితాలో మన రాష్ట్రం ఉందా? లేదంటే మన పొరుగు రాష్ట్రం ఉన్నదా? మీరు ఊహించినవేనా లేదా అస్సలు ఊహించనివేనా? అసలు ఎవరు ఈ రికార్డు బ్రేక్ చేశారు? వాళ్లు ఎందుకు ఈ స్థితికి వచ్చారు? ఎవరి భాషలో ఏమాత్రం బాధ్యత ఉంది? ఇంతకీ సంస్కారం గొప్పదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవండి.
ఎలా వెలుగులోకి వచ్చింది?
దేశవ్యాప్తంగా 2014 నుండి 2025 వరకు గాళీ బంద్ ఘర్ అభియాన్ అనే వినూత్న ప్రచారాన్ని ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ జాగ్లాన్ నిర్వహించారు. సెల్ఫీ విత్ డాటర్ ఫౌండేషన్, మహర్షి దయానంద్ యూనివర్సిటీ సహకారంతో ఆయన నడిపిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, యువత, విద్యార్థులు, టీచర్లు, ఆటో డ్రైవర్లు, పోలీస్ అధికారులు, డాక్టర్లు వంటి విభిన్న వర్గాలకి చెందిన దాదాపు 70,000 మందిపై సర్వే నిర్వహించింది. ఇంట్లో మాట్లాడే భాష, బూతుల అలవాట్లు, సమాజంలో ఇది ఎలా నార్మలైజ్ అవుతుందో తెలుసుకునే ఉద్దేశ్యంతో ఈ డేటా సేకరించారు.
బూతుల్లో అగ్రస్థానం ఈ రాష్ట్రానిదే!
ఈ సర్వేలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి వారు 80 శాతం మేర బూతు మాటలు ఉపయోగిస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా మహిళలపై టార్గెట్ అయ్యే బూతుల వాడకం ఎక్కువగా ఉంది. ఢిల్లీ జీవనశైలి వేగంగా, ఒత్తిడితో నిండిపోయింది. ట్రాఫిక్, పొల్యూషన్, పోటీ.. ఇవన్నీ కలసి మనసులో కోపాన్ని, నిరాశను తిట్ల రూపంలో బయటపెడుతున్నారట ఢిల్లీ వాసులు.
పంజాబ్ 78 శాతం బూతుల వాడకంతో రెండో స్థానంలో ఉంది. పంజాబీలు బోల్డ్, ముక్కుసూటీగా మాట్లాడే ప్రజలు. ఇక్కడ తిట్లు ఎక్కువగా సరదాగా, స్నేహంగా వాడతారు. కానీ ఇతర ప్రాంతాల వారికి ఇది అసభ్యంగా అనిపించవచ్చు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రెండూ 74 శాతం తో మూడో స్థానం పంచుకుంటున్నాయి. ఇక్కడ రాజకీయ ర్యాలీల్లో, పల్లె గొడవల్లో, దైనందిన సంభాషణల్లో తిట్లు ఎక్కువగా వినిపిస్తాయి. కోపానికి గానీ, ఆధిపత్యానికి గానీ ఇక్కడ ఇలాంటి మాటల వాడకం జరుగుతుంది. ప్రజల భావోద్వేగాలు బలంగా బయటపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాలలో బూతులు సహజంగా వినిపిస్తున్నాయట.
రాజస్థాన్ 68 శాతంతో నాలుగో స్థానం దక్కించుకుంది. రంగుల రాష్ట్రంగా పేరు పొందిన రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లో స్నేహంగా అయినా తిట్లు వినిపిస్తుంటాయి. గ్రామాల తమ్మిళ్ళ మధ్య సరదా సంభాషణల్లోనూ, కుటుంబ తగాదాల్లోనూ గాలి మాటలు వినిపించవచ్చు. హర్యానాలో 62 శాతం మంది తిట్లాడే మాటల వాడకం కలిగి ఉన్నారు. ఇక్కడ రఫ్ అండ్ టఫ్ శైలిలో మాట్లాడటమే అలవాటు. గ్రామీణ గర్వం, పల్లె సంస్కృతి ప్రభావంతో ఎక్కువగా తిట్లు వినిపిస్తాయి, ముఖ్యంగా పురుషుల మధ్య ఇలాంటి మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయట.
మహారాష్ట్రలో 58 శాతం తిట్ల వాడకం ఉంది. ముంబయి, పుణే వంటి నగరాల్లో ట్రాఫిక్, ఉద్యోగ ఒత్తిళ్లు తిట్ల రూపంలో బయటపడతాయి. స్ట్రీట్ లాంగ్వేజ్, లోకల్ ట్రైన్ సంస్కృతి కూడా ఇందుకు కారణం. గుజరాత్ లో తక్కువగా అనిపించినా 55 శాతంతో జాబితాలో ఏడో స్థానంలో ఉంది. సాధారణంగా గుజరాతీలు వినయంగా ఉండేవారు. కానీ యువతలో, పాప్ కల్చర్ ప్రభావంతో స్నేహంగా బూతులు వినిపించటం సహజం.
మధ్యప్రదేశ్లో 48 శాతం మంది బూతుల అలవాట్లు ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా పల్లెటూర్లలో, లోకల్ తరహాలో బూతులు ఒక భాగంగా మారిపోయాయట. అంతేకాదు కోపంతో కాకుండా, అలవాటుగా వచ్చేస్తుంటాయి. ఉత్తరాఖండ్ లో 45 శాతం మందికి బూతులు మాట్లాడే అలవాటు ఉందట. సాధారణంగా శాంతి ప్రేమికులుగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్ర ప్రజల్లో మారుతున్న జీవనశైలి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రభావాలతో తిట్లు వినిపిస్తున్నాయట.
కశ్మీర్ లో బూతులు తక్కువే!
కశ్మీర్ ఈ జాబితాలో తక్కువగా సర్వేలో తేలింది. 15 శాతం బూతుల వాడకం మాత్రమే ఈ రాష్ట్రంలో ఉందట. ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా తక్కువ. ఇక్కడ కుటుంబ విలువలు, మతపరమైన ఆచారాలు, ఓర్పు ఇవన్నీ భాషపై ప్రభావం చూపిస్తాయి. కాశ్మీరీ ప్రజలు సాధారణంగా మృదువుగా మాట్లాడతారని సర్వేలో తేలిన అంశం.
ఈ అధ్యయనం నుండి.. మాటల్లో బూతులు వాడటం కొన్ని రాష్ట్రాల్లో అలవాటుగా మారిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. కానీ దీని ప్రభావం పిల్లలపై, మహిళలపై, కుటుంబ సంబంధాలపై తీవ్రంగా పడుతోందట. అందుకే ‘గాళీ బంద్ ఘర్’ ఉద్యమం బూతుల మాటలపై ఆలోచన కలిగించడమే కాకుండా, ఇంట్లో మంచి మాటలు మాట్లాడే శైలిని ప్రోత్సహిస్తోంది. అయితే కొసమెరుపు ఏమిటంటే.. ఈ రాష్ట్రాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్థానం ఉండకపోవడం గర్వించదగ్గ విషయం.