ప్రముఖ ఆస్ట్రాలజర్, సోషల్ మీడియా ట్రెండింగ్ పర్సన్ వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని మొదలుకొని అమ్మవారి నైవేద్యం వరకు, కాశీ కాలభైరవుడి నుంచి తారాదేవి వరకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
అమ్మవారికి నైవేద్యంగా మాంసం, మద్యం
తాను చేసే పూజల్లో నాన్ వెజ్, లిక్కర్ కచ్చితంగా ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఫలితం పొందాలంటే పూజ నిష్టతో, గొప్పగా చేయాల్సి ఉంటుందన్నారు. “పూజకు 5 కిలోల పూలు సరిపోతాయి అనుకుంటే, నేను 10 కిలోలు తెప్పిస్తా. అవి కూడా కాస్ట్ లీ పూలు. బెంగళూరు నుంచి తెప్పిస్తా. నేను వాడే వస్తువులు ఖరీదుగా ఉంటాయి. ప్రసాదం కోసం అందరూ మామూలు జామ వాడితే, నేను థాయ్ లాండ్ జామ వాడుతాను. నైవేద్యంలోకి మేక మాంసం కాకుండా నేను పొట్టేలు మాంసం వాడుతాను. అమ్మవారికి కొర్రీమీను నైవేద్యం పెడతాను. కామాఖ్య అమ్మవారు నాన్ వెజ్ మాత్రమే తీసుకుంటారు. కొంత మంది దుర్మార్గులు నన్ను విమర్శించాలి కాబట్టి నాన్ వెజ్ ఉండదని చెప్తున్నారు. వాళ్లు చెప్పేది నిజం కాదు. కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్తే కనిపించేది నాన్ వెజ్, లిక్కర్ మాత్రమే. తెలంగాణలో దసరా పండుగ నాడు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. దసరా అమ్మవారికి ప్రతీక. తెలంగాణలో 40 రోజుల పాటు బోనాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం అందరి ఇళ్లలో నాన్ వెజ్ ఉంటుంది. తిరుపతి, శ్రీకాళహస్తికి నాన్ వెజ్ తిని వెళ్లరు. అవి దక్షిణాచార పూజలు. వేంకటేశ్వర స్వామి దగ్గరికి నాన్ వెజ్ తిని వెళ్లం” అన్నారు.
స్నానం చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారా?
స్నానం చేసి దేవుడిని దర్శించుకోవాలి అంటారని, తిరుమలలో అలా జరగడం లేదన్నారు వేణు స్వామి. “దేవుడి దగ్గరికి స్నానం చేసి వెళ్లాలి. 1998కి ముందు ఎవరైనా తిరుపతికి వెళ్లిన వాళ్లు ఎలా వెళ్లేవారు? 14 గంటలు, 15 గంటలు లైన్ లో నిలబడి దర్శనం చేసుకోవాలి. నేను అలాగే చేసుకున్న. అప్పుడు స్నానం ఎక్కడ చేశాం? తిరుపతిలో దర్శనానికి వెళ్తుంటే.. విమాన గోపురానికి దగ్గరలో బ్రిడ్జిలాగ వస్తుంది. దానికి లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ ఉంటాయి. అందులోకి వెళ్లి.. అక్కడి నుంచి దర్శనానికి వెళ్లొచ్చా? స్నానం చేసి వెళ్లాలి కదా? బాహ్య శుద్ధి కంటే అంత:శుద్ధి ముఖ్యం. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునుడే కష్టం అయినప్పుడు, స్నానం చేసి వెళ్లినవా? చేయకుండ వెళ్లినవా? అనేది ఆయన ఆలోచించడు” అని చెప్పుకొచ్చారు.
కాశీలో మద్యంతో అభిషేకం!
దేశ వ్యాప్తంగా మద్యంతో అభిషేకం చేసే ఆలయాలు చాలా ఉన్నాయన్నారు వేణు స్వామి. “కాశీకి వెళ్తే కాళ భైరవుడి దగ్గర భంగు ఎక్కిస్తారు. తారాపీఠ్ లో తారా దేవికి లిక్కర్ పోస్తారు. అమ్మవారికి లిక్కర్ తో అభిషేకం చేయించే ఆలయాలు దేశంలో వందల సంఖ్యలో ఉన్నాయి. వాటి గురించి తెలియకుండా మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్లు చాలా మంది ఉంటారు. దేవుడి దగ్గరికి పోని వాళ్లు కూడా విమర్శిస్తున్నారు. వేణు స్వామి నాన్ వెజ్ పెట్టుకుంటడు. లిక్కర్ పెట్టుకుంటడు. ఏమన్నా పెట్టుకుంటడు. నీకెందుకు రా అయ్యా? అనవసరమైన విమర్శలు మానుకోవడం మంచిది” అన్నారు.
Read Also:కారు అంత బరువున్న రాకాసి పాము.. ఇంకా పెరుగుతూనే ఉందట!