Titanoboa Cerrejonensis: పాముల గురించి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అతి చిన్న పాముల నుంచి అతిపెద్ద పాముల వరకు గుర్తిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అతిపెద్ద పాము అనగానే అనకొండ గుర్తుకు వస్తుంది. కానీ, తాజాగా అనకొండకు అమ్మమ్మ లాంటి పామును కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ పాము 58 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేదని గుర్తించారు. ఈ పాము టైటానోబోవా సెరెజోనెన్సిస్ జాతికి చెందినట్లుగా వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్ద పాముగా తేల్చారు. అనకొండ, పైథాన్ కూడా ఈ పురాతన సరీసృపం ముందు దిగదుడుపే అన్నారు.
టైటానోబోవా సెరెజోనెన్సిస్ గురించి..
ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గుర్తించిన అతిపెద్ద పాము ఇదే అని వెల్లడించారు. ఇప్పటి వరకు అనకొండను ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తించారు. కానీ, ఇప్పుడు అన్ని పాములను టైటానోబోవా సెర్రెజోనెన్సిస్ వెనక్కి నెట్టింది. ఇటీవల కనుగొనబడిన ఈ పాము 58 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం పాలియోసిన్ అనే కాలంలో నడియాడినట్లు గుర్తించారు. డైనోసార్ సమయంలోనే ఈ పాము కూడా జీవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టైటానోబోవా సెర్రెజోనెన్సిస్ అవశేషాలు 2009లో కొలంబియా ఉత్తరాన ఉన్న సెర్రెజోన్ బొగ్గు గనిలో కనుగొన్నారు. పురాతన కాలంలో, ఈ ప్రదేశం చాలా వెచ్చని, తేమతో కూడిన వర్షారణ్యంతో ఉండేది.
టైటానోబోవా పరిమాణం, బరువు
టైటానోబోవా సెర్రెజోనెన్సిస్ పరిమాణం, బరువు కారణంగా మిగిలిన పాములకు పూర్తి భిన్నమైనదిగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం.. ఇది సుమారు 14 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్కూల్ బస్సు లాగా ఉంటుంది. అంతేకాదు, ఒక టన్ను కంటే ఎక్కువ బరువు ఉంటుందని భావిస్తున్నారు. మనకు బాగా తెలిసిన ఇతర సాధారణ పాములతో పోల్చినట్లయితే, దాని పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. అందుకే ఇది చరిత్రలో అతిపెద్ద, బరువైన పాము.
Read Also: జాలీగా జలకాలాడుతుంటే.. మెడపై మెత్తగా ఏదో తగిలింది.. ఇక పరుగో పరుగు!
విషం లేని పాముగా గుర్తింపు..
టైటానోబోవా సెర్రెజోనెన్సిస్ కు విషం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాము కూడా అనకొండలాగే జంతువుల మింగేసేదని గుర్తించారు. ప్రతిసారీ తిన్న జంతువు ఇక ఊపిరి పీల్చుకోలేనంతగా చేసి చంపేసేది. ముందు పాము తను ఆహారంగా ఎంచుకున్న జంతువును ముందుగా తలను మింగేది. ఆ తర్వాత పూర్తిగా మింగేసేది. ఇది పెద్ద క్షీరదాలు, సరీసృపాలను మాత్రమే తింటుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ. కొత్త పరిశోధన ఇది తప్పు అని తేల్చింది. ఈ పాములు చేపలను తినేవని గుర్తించారు. అంతేకాదు, టైటానోబోవా సెరెజోనెన్సిస్ అనేది ప్రస్తుత అనకొండల మాదిరిగా నీటిలో ఎక్కువగా నివసించే నీటి పాము అని నిర్ధారించారు. ఇది ప్రధానంగా నదులు, ఉష్ణమండల మడుగులలో పెద్ద చేపలను తినేదని అంచనాకు వచ్చారు. త్వరలో ఈ పాముకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
Read Also: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!