Viral Baraat Video: దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. సాయంత్రం ఐదు అయినా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అయితే, ఎర్రటెండలోనూ పెళ్లి బారాత్ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండల నుంచి తట్టుకునేందుకు వాళ్లకు వచ్చిన ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మధ్యప్రదేశ్ లోని దేవాస్‌లో ఇటీవల తీవ్ర వేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు భగ్గుమంటున్న ఈ సమయంలో ఒక పెళ్లి ఊరేగింపు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా పెళ్లి బారాత్ అంటే డ్యాన్స్, బ్యాండ్, సంగీతంతో హడావుడిగా సాగుతుంది. కానీ, వాళ్లు వేడిని ఎదుర్కొనేందుకు ఓ క్రేజీ ఆలోచన చేశారు. పెళ్లి ఊరేగింపులో భాగంగా మూవింగ్ కూలర్ ను ఏర్పాటు చేశారు. అంటే, బారాత్ గా వెళ్తున్న వారిని కవర్ చేసేలా రెండు వైపులా కూలర్లను ఉంచి ఊరేగింపుతో పాటు ముందుకు లాక్కెళ్లారు. ఎండలో కూడా చల్లని గాలిని ఆస్వాదిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా ముందుకు సాగారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిన్న ఐడియాతో దాని నుంచి ఉపశమనం పొందారు.
ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎవరూ ఊహించని విధంగా కూలర్లను ఉపయోగించడం అందరినీ ఆకట్టుకుంది. బారాత్‌లో పాల్గొన్న వారు చెమటలు పట్టకుండా, చల్లని గాలిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెళ్లి వాతావరణం మరింత ఉత్సాహంగా కనిపించింది. ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించి కొంత మంది యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజన్లు ఈ ఆలోచనను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇది నిజంగా తెలివైన ఐడియా అని చెప్పగా, మరికొందరు ఇలాంటి పద్ధతులు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందవచ్చని అభిప్రాయపడ్డారు.
Read Also: రెడ్, బ్లూ, గ్రీన్.. ఏ కలర్ గ్రీజ్ ఎందుకు వాడుతారో తెలుసా?
దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ప్రజలకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. వేడిని తట్టుకోవడం కోసం ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన మరింత క్రియేటివ్ గా ఉంది. ఎండ తీవ్రతను కూడా సరదాగా మార్చుకుని, ఆనందాన్ని అలాగే కొనసాగించడం ఆసక్తి కలిగిస్తుంది. పెళ్లి అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అందులో సృజనాత్మకత కూడా ఉండొచ్చని ఈ సంఘటన నిరూపించింది.
Read Also: కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!