భూమ్మీద అతిపెద్ద జీవులు అనగానే చాలా మంది డైనోసార్లు అని చెప్తారు. కానీ, సముద్రం లోపలి చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. సముద్ర గర్భంలో అనంతకోటి ప్రాణాలు ఉన్నా, వాటిలో చాలా జీవులు డైనోసార్లను తలదన్నే భారీ రూపంలో ఉన్నా, ఇప్పటీ చాలా వరకు రహస్యంగానే ఉండిపోయింది. కొన్ని శిలాజాలు అప్పుడప్పుడు సముద్రంలోని జీవుల చరిత్రలను చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఆ చరిత్రను మనకు ఒక్కోసారి ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఓ సముద్ర జీవికి సంబంధించిన అస్థిపంజరం బయటపడింది. దాని అవశేషాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తాజాగా ఆ అవశేషాలను పరిశీలించిన సముద్ర పరిశోధకులు.. మానవులు ఈ భూమ్మీద పుట్టడానికి మిలియన్ల సంవత్సరాల ముందు జీవించిన సముద్ర పామువిగా గుర్తించారు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిని పాలియోఫిస్ కొలోస్సేయస్ గా పరిశోధకులు గుర్తించారు. 56 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర పాముగా తేల్చారు. పలోయోఫిస్ కొలోస్సేయస్ అనేది జీవశాస్త్రానికి తెలిసిన అతిపెద్ద సముద్ర పాముకు పెట్టిన పేరు. ఇది ఈయోసిన్ యుగంలో దాదాపు 56, 34 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. శిలాజ వెన్నుపూసల నుంచి మాత్రమే ఈ జీవిని గుర్తించవచ్చు. కానీ, ఆ ఎముకలు అసాధారణంగా పెద్దవిగా ఉంటాయి. వాటి నిష్పత్తుల ఆధారంగా, పరిశోధకులు ఈ పాము 8 నుంచి 12 మీటర్ల పొడవు వరకు పెరిగిందని అంచనా వేస్తున్నారు. అంటే, ప్రస్తుతం జీవించి ఉన్న సముద్ర పాము కంటే చాలా ఎక్కువ.
ఈ అతిపెద్ద సముద్ర పాము ఆఫ్రికా సమీపంలో నివసించిందని పరిశోధకులు వెల్లడించారు. ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు వెచ్చని, నిస్సార సముద్ర వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ట్రాన్స్ సహారా సముద్రమార్గం అని పిలుస్తారు. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాము జీవించి ఉండేదని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎడారిగా ఉన్న ప్రాంతాలు ఒకప్పుడు జీవజాలంతో నిండి ఉన్న తీరప్రాంత జలాలు. ఇంత పెద్ద సముద్ర పాము ఉండటం ఈ సముద్రాలు ఆధునిక ఉష్ణమండల మహాసముద్రాల కంటే వెచ్చగా ఉన్నాయని సూచిస్తున్నాయి. పెద్ద పాములు వాటి శరీరాలను నియంత్రించడానికి వేడి మీద ఆధారపడతాయి. చల్లని పరిస్థితులలో ఇంత పెద్ద పాము జీవించడం సాధ్యం కాదు. అప్పటి వేడి వాతావరణం చేపలు, సొరచేపలు, ఇతర సముద్ర సరీసృపాలకు అనుకూలంగా ఉండేదని పరిశోధకులు వెల్లడించారు.
ఈ పాము జీవించేందుకు సొరచేపలను తిన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పాలియోఫిస్ కొలోస్సీయస్ వేటకు సంబంధించి ప్రత్యక్ష ఆధారాలు ఏవీ చూపించలేదు. కానీ, పరిమాణం కొన్ని ఆధారాలను అందిస్తుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పాముకు ఎక్కువ ఆహారం కావాలి. ఇందులో డైరోసౌరిడ్స్ అని పిలువబడే పెద్ద చేపలు, సొరచేపలు, మొసలి లాంటి సరీసృపాలను తిని ఉండవచ్చిన అనుమానిస్తున్నారు. పెద్ద మాంసాహారులు సాధారణంగా పెద్ద జంతువులను లక్ష్యంగా చేసుకుంటాయి అనే కోణంలో ఈ అంచనాకు వచ్చారు. దీనితో పోల్చితే ప్రస్తుత సముద్ర పాములు చాలా చిన్నవి. ఎక్కువ కాలం జీవించే పసుపు సముద్ర పాము గరిష్టంగా 3 మీటర్ల వరకు ఉంటుంది.
Read Also: నువ్వు పొట్టోడివి అంటూ ఎగతాళి చేశారు, ఏకంగా డాక్టరై నోళ్లు మూపించాడు!