Students hospitalised : ఇటీవల కాలంలో ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. తాజాగా.. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని ఓ కేజీబీవీ లో ఒకేసారి 14 మంది విద్యార్థులు సైతం అనారోగ్యానికి గురయ్యారు. దాంతో.. విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏజెన్సీ ప్రాంతంలో మాములుగానే వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఆయా ప్రాంతాల్లో పాఠశాలల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ.. రంపచోడవరం నియోజకవర్గం లోని వై.రామవరం మండలం తోటకూర పాలెం గ్రామంలోని కస్తూరిబాయి బాలికల ఆశ్రమ పాఠశాల, కళాశాలలో ఫిబ్రవరి 6న ఒకేసారి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థినిలు అనారోగ్యం గురించి తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం వెంటనే ఆ విద్యార్థుల్ని చవిటి దిబ్బలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన వైద్య సిబ్బంది.. విద్యార్థులకు అవసరమైన మందులు, సెలైన్లు అందించారు. దాంతో.. కొంత సేపటికి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అయితే.. కేజీబీవీ పాఠశాలలో ఆహార కల్తీ జరిగినట్లుగా ప్రచారం సాగడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల పాఠశాలల్లోనూ అంతా అప్రమత్తమయ్యారు.
విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. విద్యార్థినిల అనారోగ్యానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని తేల్చారు. దాంతో.. పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. లేదంటే.. ప్రభుత్వ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండడంతో, తమపై చర్యలు తప్పవని ఆందోళన చెందారు. కానీ.. వైద్యుల నిర్థరణలతో ఉపాధ్యాయులు.. అనారోగ్య కారణాలు తెలుసుకునేందుకు పాఠశాలకు రావాల్సిందిగా వైద్యుల్ని కోరారు.
అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థులలో.. 8 మంది విద్యార్థులు వాంతులతో ఇబ్బంది పడగా, నలుగురు విద్యార్థులు విరోచనాలతో ఆసుపత్రికి చేరుకున్నారు. మరో ఇద్దరు గవద బిల్లల కారణంగా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. వారందరికీ అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆరుగురు, 6వ తరగతి చదువుతున్న నలుగురు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరితో పాటు 7, 9 ,10 చదువుతున్న మొత్తం 14 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు.
పాఠశాల యాజమాన్యం అభ్యర్థనతో పాఠశాలను సందర్శించిన వైద్య బృందం.. పాఠశాలలో విద్యార్థులంటే చోటు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు ఉండడం, అక్కడే నిద్రపోతుండడంతో.. వారు అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తేల్చారు. పరిశుభ్రత పాటించడంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థినీలు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు వైద్య బృందం తేల్చింది.
Also Read :
మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా పాఠశాలలో పారిశుద్యం, త్రాగునీరు వంటి వాటితో పాటు తమ పిల్లల పరిశుభ్రత పట్ల పాఠశాల యాజమాన్యం అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు, పాఠశాల యాజమాన్యం సైతం.. ఈ విషయంపై దృష్టి సారించినట్లు వెల్లడించాయి.