RGV Case Update: ఎట్టకేలకు వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై నమోదైన కేసుకు సంబంధించి.. ఒంగోలు పోలీసుల ముందు రేపు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు ఆర్జీవీ తన హాజరు గురించి సమాచారం ఇచ్చారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు లో గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలిసారిగా నోటీసులు జారీ చేయగా, విచారణకు హాజరయ్యేందుకు తనకు కాస్త సమయం కావాలని ఆర్జీవీ పోలీసులను కోరారు. ఆ తర్వాత మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆర్జీవీ గృహం వద్ద మరోమారు నోటీసులను అందజేశారు.
ఇదే అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో మరో మారు ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందించగా, విచారణకు తాను హాజరుకానున్నట్లు రాంగోపాల్ వర్మ పోలీసులకు సమాచారం అందించారు. రాంగోపాల్ వర్మ శుక్రవారం విచారణకు హాజరవుతున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు తెలిపారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్యలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫోటోలను రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే రేపు విచారణకు రాంగోపాల్ వర్మ హాజరుకానుండగా, పోలీసులు ప్రత్యేక ప్రశ్నావళిని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Male Loan Groups: పురుషుల పొదుపు సంఘం గ్రూప్స్.. ఈ రూల్స్ తెలుసుకోండి!
అయితే ఆర్జీవీ విచారణకు వాస్తవంగా వస్తున్నారా? విచారణలో ఎటువంటి ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు? వాటికి ఆర్జీవీ సమాధానం ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు రేపు సమాధానం దొరుకుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద రాంగోపాల్ వర్మ ఒంగోలుకు రానున్నట్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తగిన బందోబస్తును సైతం ఏర్పాటు చేస్తున్నారు.