ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టిన ఆంధ్రా అమ్మాయి రాజ్యలక్ష్మి యార్లగడ్డ.. మృత్యు ఒడిలో ఒదిగిపోయింది. 23 ఏళ్ల యువతి నవంబర్ 7న ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్ A&M యూనివర్సిటీ కార్పస్ క్రిస్టి నుంచి ఇటీవల గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నది. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తాజాగా కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె బంధువులు వెల్లడించారు. నవంబర్ 7న ఉదయం అలారం మోగుతున్నా, ఆమె స్పందించకపోవడంతో వెళ్లి చూశామని కజిన్ చైతన్య చెప్పారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించామన్నారు.
రాజ్యలక్ష్మి బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. మంచి ఉద్యోగాన్ని పొందాలనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లింది. చదువుల్లో బాగా రాణించే ఆమె, ఈ మధ్యే మాస్టర్స్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలోనే చనిపోయిందని ఆమె కజిన్ చైతన్య సోషల్ మీడియాలో వెల్లడించారు. మరణానికి ముందు కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. 2-3 రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె మృతిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోని కారం చేడుకు చెందిన రాజ్యలక్ష్మి.. విజయవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికాకు వెళ్లింది. అక్కడ తమ బంధువుల దగ్గర ఉంటూ చదువుకుంది. కానీ, అనారోగ్యం కారణంగా ఆమె అకాల మరణం పొందింది. ఆమె చనిపోయిన వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎంతో సాధించాలని అమెరికాకు వెళ్లి, ఏం సాధించకుండానే చనిపోయిందంటూ గోడు గోడున విలపిస్తున్నారు.
Read Also: రాసి పెట్టుకోండి.. ఆ రోజు భూమి మొత్తం చీకటైపోతుంది, ఇంకెతో టైమ్ లేదు!
అటు రాజ్యలక్ష్మి అంత్యక్రియల ఖర్చులు, ఆమె ఎడ్యుకేషన్ లోన్ చెల్లింపు, ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చులకు సాయం చేయడానికి మిత్రులు, ‘గో ఫండ్ మీ’లో కజిన్స్ క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. ఈ బాధాకర సమయంలో ఆమె కుటుంబానికి అండగా ఉండాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు, సమాజాన్ని కజిన్ చైతన్య విజ్ఞప్తి చేశారు “రాజీ కుటుంబం ఈ సమయంలో పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. మేము, మా స్నేహితులం కలిసి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, ఆమె ఎడ్యుకేషన్ లోన్స్, అంత్యక్రియల ఖర్చులు, బాడీని ఇండియాకు తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చులతో పాటు ఆమె కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం కోసం మేము నిధులను సేకరిస్తున్నాము. అందరూ సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం” అని చైతన్య రిక్వెస్ట్ చేశారు. కాగా, ఇప్పటి వరకు లక్షా 25 వేల అమెరికన్ డాలర్లు సేకరించారు.
Read Also: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!