విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరగుతాయి. అలాంటి అద్భుతం త్వరలో మరొకటి జరగబోతోంది. ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిమయం కాబోతోంది. పట్టపగలు ఏకంగా ఆరున్నర నిమిషాల పాటు ఈ చీకట్లు అలుముకోనున్నాయి. ఈ విషయాన్ని నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కన్ఫార్మ్ చేశాయి. దానికి కారణంగా సంపూర్ణ సూర్యగ్రహణం. ఆగస్టు2, 2027న అత్యంత పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల వరకు భూమి అంతా అంధకారంగా మారనుంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి సూర్యగ్రహణాలు ఏర్పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
భూమి, సూర్యుడి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతిని పూర్తిగా భూమ్మీదికి రాకుండా అడ్డుకుంటుంది. అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నిమిషాల పాటు, ఆకాశం చీకటిగా మారుతుంది. పగటి పూటే చీకట్లు కమ్ముకుంటాయి. ఈ గ్రహణం ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, దక్షిణ ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈజిప్టులోని లక్సోర్ నగరానికి సమీపంలో అత్యంత పొడవైన బ్లాక్ అవుట్ కనిపిస్తుంది. అక్కడ పట్టపగలే 6 నిమిషాలకు పైగా చీకటి కనిపిస్తుంది. దక్షిణ స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్ లాంటి ప్రదేశాలు కూడా పూర్తి గ్రహణాన్ని చూడవచ్చు. ఈ మార్గం వెలుపల ఉంటే పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఎందుకంటే, చంద్రుడు సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాడు. కానీ, పూర్తి మాయాజాలాన్ని అనుభవించాలంటే, ఈజిప్ట్ కు వెళ్లాల్సిందే.
ఈ గ్రహణం అత్యంత అరుదైనదిగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది 21వ శతాబ్దంలో అతి పొడవైన సూర్య గ్రహణంగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఇంత పొడవైన గ్రహణం మరో 87 సంవత్సరాల వరకు భూమ్మీద ఏర్పడదు. ఇలాంటి సూర్య గ్రహణం చూడాలంటే 2114 వరకు ఆగక తప్పదు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని జీవితంలో ఒకసారి జరిగే అరుదైన అద్భుతం అని చెప్తున్నారు. ఆరున్నర నిమిషాల వ్యవధిలో పగటిపూట ఆకాశం చీకటిగా మారుతుంది. ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి కూడా.
అత్యంత అరుదైన ఈ సూర్యగ్రహణం గురించి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు పలు కీలక విషయాలను వెల్లడించాయి. నాసా తన గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ద్వారా ఈ గ్రహణాన్ని ట్రాక్ చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన కచ్చితమైన మార్గం, సమయాన్ని ఇప్పటికే మ్యాప్ చేసింది. ఈజిప్టులో అత్యంత పొడవైన మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల సూర్యగ్రహణం ఉంటుందని వెల్లడించింది. సోలార్ ఆర్బిటర్ వంటి మిషన్లతో సూర్యుడిని అధ్యయనం చేసే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసింది. ఈ సంఘటన గురించి కీలక విషయాలను ప్రపంచంతో పంచుకోవడానికి నాసాతో కలిసి పనిచేస్తుంది. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకుని మాత్రమే చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Also: ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ కామెట్ బ్రౌజర్.. గూగుల్‌కు చెమటలు పట్టిస్తోన్న పర్ ప్లెక్సిటీ!