Elephant Attack: వారంతా పుణ్యం కోసం వెళ్లారు.. కానీ మృత్యువు వారిని వెంటాడింది.. వేటాడింది.. దీంతో వారి కుటుంబాల్లో మిగిలింది తీరని ఆవేదనే.. ఎవరూ తీర్చలేని లోటే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఘోర విషాదం జరిగింది. వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి బయలుదేరిన శివయ్య భక్తులపై గజరాజులు విరుచుకుపడ్డాయి. భక్తులపై ఏనుగుల మంద దాడితో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారు. గాయపడిన వారిని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలో గుండాల కోనలో శివుడి ఆలయం ఉంది. బుధవారం మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివయ్యను దర్శించునకునేందుకు బయల్దేరారు. మార్గమద్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు ఒకే కుంటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.
కాగా గుండాల కోనలో ఉన్న మల్లేశ్వరాలయంలో మహాశివరాత్రిని స్థానిక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం నాడు ఐదువేల మందికి అన్న దానం ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి.
ఇక ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మృతి చెందడం బాధాకరం అన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులకు పవన్ ఆదేశించారు.
Also Read: కేరళలో దారుణం.. గంటల వ్యవధిలో 5 హత్యలు చేసిన యువకుడు
కాగా అదే ప్రాంతంలో గత కొంత కాలంగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాదోంళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్యజిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. గ్రామ శివారులో ఉన్న ఇళ్లను, వాహనాలను, మనుషులపై దాడి చేస్తూ.. గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.