SLBC Tunnel Collapse: భూగర్భం తవ్వడం మనం అనుకున్నంత ఈజీ కాదు. వ్యయప్రయాసలు ఎన్నో ఉంటాయి. చాలా వరకు రోడ్ల కోసం, నీటి తరలింపు కోసం ఇలా టన్నెల్స్ తవ్వుతుంటారు. ఇప్పుడు SLBCలో ప్రమాదం జరగడంతో అందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్నది SLBC సొరంగ తవ్వకం పనుల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 14వ కిలోమీటర్ దగ్గర ఉరుము ఉరిమినట్లుగా ఒక్కసారిగా మట్టి, నీటి ఊట కలిసి కూలడంతో అక్కడ పని చేస్తున్న వారు చిక్కుకుపోయారు. అసలేం జరిగిందో చాలా సేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. పైకప్పు నుంచి మట్టి, బురద, నీళ్లు పడడంతో కార్మికులంతా ఎగిరిపడ్డారు. పైపులు, ఇనుపరాడ్లు మీద పడి కార్మికులకు దెబ్బలు తగిలాయి. ముఖమంతా బురద చిమ్మింది. కొద్ది దూరంలో ఉన్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికొచ్చారు. 8 మంది మాత్రం ఎక్కడ చిక్కుకున్నారన్నది క్లారిటీ రావడం లేదు. క్షణక్షణం ఆందోళన పెరుగుతోంది.
SLBC సొరంగం పనుల్లో ఊహించని ఉత్పాతం..
ఆ 8 మందిని కాపాడడమే ప్రయారిటీ..
లోపలంతా బురద మడుగు..
చెల్లాచెదురుగా మెషినరీ..
సహాయ చర్యలకు ఆటంకాలు..
టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సహాయ చర్యల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. లోపలున్న వారిని పేర్లతో పిలిచినా వారి నుంచి ఎలాంటి జవాబు రావడం లేదంటున్నారు. ఇంకోవైపు సహాయ చర్యల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. టన్నెల్‌లో 11వ కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర భారీగా నీరు నిలిచిపోయింది. టన్నెల్‌లో రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య భారీ నీరు నిలవడంతో సహాయ చర్యలు ముందుకు సాగట్లేదు. ప్రత్యేకంగా పంపులు తెప్పించి డీవాటరింగ్ చేస్తున్నారు. ఇక సొరంగంలో 13వ కిలోమీటర్ నుంచి నీళ్లు ఉండగా 13.5 కిలోమీటర్ల నుంచి బురదతో కూడిన నీళ్లు ఉన్నాయి. అక్కడే సమస్య ఉంది. లోపల ఉన్న బురదను, మడుగులో ఉన్న మట్టి, వ్యర్థాలను తీసేసి సొరంగం బయటికి తేవడం పెద్ద టాస్క్.
14 కి.మీ జర్నీకి గంటకు పైగా సమయం
టన్నెల్ బోరింగ్ మిషన్ నడిస్తేనే కన్వేయర్ బెల్టు కూడా నడుస్తుంది. ప్రస్తుతం లోపల సిస్టమ్ అంతా ఆగిపోయింది. మెషిన్ పైనే మట్టి కూలడంతో కన్వేయర్ బెల్టు నడవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సొరంగం బయటి నుంచి లోపలికి లోకో ట్రైన్ ద్వారా వెళ్తున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల దూరం రావడానికి పోవడానికి గంటా 10 నిమిషాల టైం పడుతోంది. ఈ రూట్ లోనే బురద మట్టిని బయటికి తీసుకురావాల్సి ఉంది. నిర్మాణ వ్యర్థాలు, మట్టి తొలగిస్తేనే అక్కడం ఏం జరిగిందో తెలుస్తుంది. లోపల మేట వేసిన మట్టి, బురదను తొలగించడానికి సింగరేణి సంస్థ నుంచి పరికరాలు తెప్పించాలంటున్నారు.
9 టన్నుల బరువు మోసే సిమెంట్ సెగ్మెంట్లు బ్రేక్
భూమిని తొలిచే టన్నెల్ బోరింగ్ మెషిన్ దాన్ని తిప్పే కన్సోల్ కు మధ్య 18 మీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో దిగువ భాగంలో 15 అడుగుల లోతు ఉంటుంది. దానిలో నిపుణులు, కార్మికులు పనిచేస్తుంటారు. సిమెంట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే పైకప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు, బురద, మట్టి కుప్పగా పడ్డాయి. వాటి ఒత్తిడి ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే 9 టన్నుల బరువును మోయగలిగిన సిమెంట్ సెగ్మెంట్లు కూడా ముక్కలయ్యాయి. భూమిని తొలిచే బోరింగ్ మిషన్ ను లింక్ చేస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్, ఎక్విప్ మెంట్ విడిభాగాలన్నీ భూమిలోకి కుంగిపోయాయి.
SLBC సొరంగం పనుల్లో 450 మంది విధులు
ఈ SLBC సొరంగం పనుల్లో 450 మంది పనిచేస్తున్నారు. వీరిలో 150 మంది మాత్రమే స్థానికులు కాగా.. మిగిలిన వారంతా జార్ఖండ్, యూపీ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలవారున్నారు. మొత్తం 3 షిఫ్టుల్లో పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్‌లో 150 మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. బోరింగ్ మిషన్ వద్ద రోజూ 40 మంది ఉండి పనులు చూసుకుంటున్నారు. మెషిన్ తవ్వినా కొద్దీ.. 15 మంది సెగ్మెంట్లు అమర్చేందుకు 15 అడుగుల దిగువలో ఉంటారు. శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా 13.9 కిలోమీటర్ల వద్ద ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది. ఈ యంత్రం 10 మీటర్ల డయాతో ప్రస్తుతం రోజుకు 4.5 మీటర్ల దూరం తొలిచి.. మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపుతోంది. ఇక్కడే ఒక్కసారిగా పైకప్పు కూలి నీటి ఊటలన్నీ పడిపోయాయి.
టన్నెల్ డిగ్గింగ్ ప్రాణాలతో చెలగాటమేనా?
సో SLBCలో కండీషన్ అనుకున్నంత ఈజీగా లేదు. టన్నెల్ డిగ్గింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే. భూగర్భం బయటకు కనిపించిన ఈజీగా ఉండదు. సింగరేణిలోనూ బొగ్గు తవ్వకాలు భూగర్భంలో వెళ్లి చేస్తుంటారు. అయితే పైకప్పులు కూలకుండా కెమికల్ గ్రౌటింగ్ చేయడం సహా పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. SLBCలో ఇటీవలే తవ్వకాలు తిరిగి మొదలైనప్పుడు నీటి ఊటలు చాలా సమస్యలు సృష్టించాయి. ఏకదాటిగా సొరంగంలోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే భూగర్భ జల ఊటలు ఉన్న చోట వాటిని ఆపడం కష్టం. అందుకోసం కెమికల్ గ్రౌటింగ్ చేస్తుంటారు. అంటే నీళ్లు లీక్ కాకుండా చేసే పని అన్న మాట. ఈ తవ్వకంలో డీవాటరింగ్ చాలా కీలకం. కానీ అది కూడా SLBC లో ఇప్పుడు తవ్వుతున్న చోట పెద్దగా వర్కవుట్ కాలేదా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి.
సొరంగాలు తవ్వడం బిగ్ టాస్క్
సొరంగాలు తప్వడం సులువైన పని కానే కాదు. చాలా అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లోపలున్న వారికి ప్రత్యేక పైపుల ద్వారా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. భూగర్భంలో లేదంటే కొండలను తొలిచి డిగ్గింగ్ చేస్తున్నప్పుడు జల ఊటల ద్వారా నీరు ఉబికి సొరంగంలోకి ధారలుగా వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు డీవాటరింగ్ ప్రక్రియ చేపట్టాలి. ఆ నీటి ఊటల్ని మూసేయడానికి కెమికల్స్ వేసి గ్రౌటింగ్ చేస్తారు. అది కూడా పూర్తిగా వర్కవుట్ అవుతుందన్న గ్యారెంటీ ఉండదు. లోపలికి వెళ్లినా కొద్దీ ఊహించని జియోలాజికల్ కండీషన్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
గ్రౌండ్ వాటర్ ప్రెజర్ తట్టుకోవడం ముఖ్యం
కొన్ని చోట్ల రాయి బలహీనంగా ఉంటుంది. ఈజీగా ఊడి పడుతుంటుంది. దాన్ని సిమెంట్ రింగ్ లు పెట్టి ఆన్ టైమ్ లో ఆపగలగాలి. గ్రౌండ్ వాటర్ ప్రెజర్ కొన్ని చోట్ల ఊహించనంత వేగంగా ఉంటుంది. దాన్ని ఆపడం కష్టం. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలంటే ప్రాపర్ గా గ్రౌండ్ వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉండాలి. దేవాదుల సొరంగం తవ్వకంలో డీవాటరింగ్‌కే వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అంచనా. సో ఏ అడ్డంకులు ఎదురైనా టన్నెల్ నిర్మాణం మరింత లేట్ అవుతుంది. ఖర్చు కూడా భారీగానే పెరుగుతుంటుంది.
2007లో SLBC నిర్మాణ పనులు ప్రారంభం
ఇప్పుడు SLBC విషయానికొద్దాం. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ భౌగోళికంగా ఎగువ ప్రాంతంలో ఉండడంతో కృష్ణా నుంచి సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు SLBC తెరపైకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో సొరంగం – టన్నెల్ -2.., 7 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది.
అంచనావ్యయం రూ.4,637 కోట్లకు చేరిక
ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు అయ్యాయి. ఎస్‌ఎల్‌బీసీని 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆరు సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటివరకు 2647 కోట్లు ఖర్చు అయింది. గత పదేళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ప్రస్తుతం అంచనా వ్యయం 4,637 కోట్లకు చేరుకుంది.
నెలకు 300 మీ. చొప్పున టన్నెల్ తవ్వకం టార్గెట్
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా రెండు, రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని లెక్కలు వేశారు. తాజాగా పెట్టుకున్న గడువు ప్రకారం 2027 సెప్టెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రమాదంతో ఏం జరగబోతోందన్నది కీలకంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం మొత్తం పొడవు 44 కిలోమీటర్లు.
టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో తవ్వకం
దీన్ని ఎలా తవ్వాలి అని చాలా చర్చించి చివరకు టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో తవ్వేలా పని చేపట్టారు. ఈ ప్రదేశం శ్రీశైలం అభయారణ్యం ప్రాంతంలో ఉండటంతో భారీ శబ్దాలు లేకుండా ఉండేందుకు ఈ మెథడ్ వాడారు. భూమికి 450 మీటర్ల దిగువన సొరంగం తవ్వకం చేపట్టేందుకు రెండు టీబీఎం మెషిన్లు తయారు చేయించారు. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక సేఫ్టీ చాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ నల్లమల అభయారణ్యం కావడంతో పైకి తవ్వే అవకాశం లేకుండా పోయింది.
మొదటి వైపు 13.9 కిలోమీటర్లు తవ్వకం
ఒక టీబీఎం శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే వైపు తవ్వకం మొదలు పెట్టగా, రెండోది నీరు బయటకు వచ్చే ప్రాంతం వైపు నుంచి చేపట్టారు. మొదటి వైపు 13.9 కిలోమీటర్లు తవ్వగా, ఇంకోవైపు 20.4 కిలోమీటర్లు తవ్వారు. మధ్యలో 9.6 కిలోమీటర్లు పెండింగ్ లో ఉంది. ఔట్‌లెట్ వైపు నుంచి పనిచేస్తున్న టీబీఎంలో బేరింగ్ దెబ్బతినడంతో దాన్ని అమెరికాలో మళ్లీ తయారు చేయించారు. అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. దాన్ని అమర్చి పని చేయించాలంటే మరో రెండు నెలల టైం పడుతుందంటున్నారు. ఇన్‌లెట్ వైపు నుంచి నాలుగేళ్ల తర్వాత తవ్వకం ప్రారంభించిన టీబీఎం.. ప్రమాదానికి గురైంది.
కొత్త TMB పెట్టాలంటే రెండుమూడేళ్ల టైం
ఈ యాక్సిడెంట్ కాకుండా ఉండి ఉంటే రెండువైపుల నుంచి పని వేగంగా నడిచేది. ఒక్కో టీబీఎం ధర 250 నుంచి 300 కోట్ల దాకా ఉంటుంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన మెషిన్ ను డిస్ మాంటిల్ చేసి బయటకు తేవాలి. కొత్త మెషిన్ ను అమెరికాలో తయారు చేయించి, ఇక్కడికి తీసుకొచ్చి అమర్చడానికి రెండుమూడేళ్లు పట్టే ఛాన్స్ ఉందంటున్నారు. సో పరిస్థితి చూస్తుంటే ఔట్ లెట్ వైపు టీబీఎంతో పని చేయించి.. ఇన్ లెట్ వైపు సంప్రదాయ పద్ధతిలో తవ్వడం ఒక ఆప్షన్ గా కనిపిస్తోంది. ఏపీలో వెలిగొండ ప్రాజెక్టులో ఇలాగే చేశారు.
కాళేశ్వరం సొరంగం తవ్వకంలోనూ 8మంది కార్మికులు మృతి
SLBCకి ముందు ఇలాగే చాలా ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2011 జులై 15న దేవాదుల సొరంగాన్ని భూగర్భంలో తవ్వుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. శాయంపేట చలివాగుకు బుంగ పడి ఒక్కసారి నీరంతా సొరంగంలోకి పోటెత్తడంతో ముగ్గురు జలసమాధి అయ్యారు. 49 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కాళేశ్వరం సొరంగం తవ్వకంలోనూ 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో 2022 జులైలో పంప్ హౌస్ లోకి క్రేన్ ద్వారా దిగుతున్నప్పుడు ఆ వైర్ తెగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు SLBC వర్క్ జరగాలంటే ముందు రెస్క్యూ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచన చేయాలి.