Amadalavalasa: ఆముదాలవలస నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చింతాడ రవి వర్సెస్ తమ్మినేని సీతారాం కోల్డ్ వార్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఒక్కోసారి ఒక్కొక్కరు పై చేయి సాధిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చింతాడ రవి అంతా తానే అన్నట్టు కనిపించారు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో నిన్న మొన్నటి వరకు వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకు వచ్చేవారు. వెన్నుపోటు, రీకాల్ చంద్రబాబు లాంటి కార్యక్రమాలకు తూ తూ మంత్రంగా హాజరయ్యారు. చింతాడ రవే నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. కానీ కొన్ని రోజుల నుంచి నిరసనలు, ఆందోళనలతో బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకుంటున్నారు తమ్మినేని. యూరియా కొరతపై చేసిన నిరసనలకు ఓసారి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ క్రమంలో మరోసారి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఆటో కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలపై, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశంపై కూడా తమ్మినేని గళం విప్పారు. అంతెందుకు కాశీభోగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పరామర్సకు వెళ్లిన వైసీపి బృందంలో బొత్సా తరువాత ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
తమ్మినేనిలో సడెన్‌గా మార్పు ఎందుకు వచ్చిందంటే ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. పోయిన దగ్గరే వెతుక్కునే ఫార్ములాను ఆయన అమలు చేస్తున్నారని తెలుస్తోంది. తన కుమారుడు చిరంజీవి నాగ్ ను ఆమదాలవలస భవిష్యత్ నేతగా తయారు చేయాలని తమ్మినేని భావిస్తున్నారు. అయితే.. ఆ ఆశలకు చింతాడ రవిరూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. చింతాడ రవికి జగన్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.
అప్పటి నుంచి తమ్మినేని అలకపాన్పు ఎక్కారని ప్రచారం నడుస్తోంది. అయితే.. కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య వివాదాన్ని చింతాడ రవి సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని పార్టీలో విమర్శలు వస్తున్నట్టు తెలుస్తోంది. కూన రవికుమార్ ని ఇరుకుని పెట్టడానికి మహిళల ఫోటోలను చింతాడ వాడుకోవడం ఆయన ఇమేజ్ను డామేజ్ చేసిందని తెలుస్తోంది. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం మహిళలను వీధిని పడేయడం సరికాదని పార్టీలో చాలామంది అభిప్రాయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చింతాడ్ రవికి నెగిటివ్ మార్కులు పడినప్పుడే తాను యాక్టివ్ అవ్వాలని తమ్మినేని సీతారాం అనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కూన రవికుమార్ వివాదం తరువాతే తమ్మినేని కూడా కార్యక్రమాల జోరు పెంచారు. అయితే జోరు పెంచడమే కాదు.. ఆ తర్వాత తన పొలిటికల్ మార్క్ కూడా చూపిస్తున్నారు. తమ్మినేని ఏ కార్యక్రమం చేసినా క్యాడర్ ఆయనతోనే ఉందని నిరూపించుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై పార్వతీపురంలో చేసిన కార్యక్రమానికి తమ్మినేనితో పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యారు. ఇక నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా మెజారిటీ వైసీపీ శ్రేణులు తమ్మినేనితోనే ఉంటున్నారు.
ఆయనతోపాటు సతీమణి, కొడుకు చిరంజీవి నాగ్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి తనయుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం దొరికిన అవకాశాన్ని తమ్మినేని చక్కగా వాడుకుంటున్నారు. అయితే.. ఇదే అంశం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోతుందేమో అన్న భయం అధినేతలో కనిపిస్తోంది. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు తమ్మినేని, చింతాడ విడివిడిగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం సంగతి అటుంచితే.. పార్టీ ముక్కలైందనే మెసెజ్ ప్రజల్లోకి బలంగా పోతుంది.
Story by Apparao, Big Tv