Farmers Protest: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి గ్రామం మరోసారి రణరంగంగా మారింది. రాజధాని అమరావతి కనెక్టివిటీకి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు రంగంలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సరైన నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను ఎలా లాక్కుంటారంటూ రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కంటిపాపలా కాపాడుకుంటూ, చేతికొచ్చిన పంటను కళ్లముందే జేసీబీలతో ధ్వంసం చేస్తుంటే రైతులు గుండె లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రైతుల ఆవేదన.. ధ్వంసమైన పంటలు
“నోటి దాకా వచ్చిన కూడును లాక్కుంటున్నారు” అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిహారం అందకపోగా, కనీసం మాట్లాడేందుకు కూడా అధికారులు సమయం ఇవ్వలేదని వారు వాపోతున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు తాము అంగీకరించలేదని, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా కూడా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను జేసీబీలతో తొలగిస్తుంటే అడ్డుకోబోయిన రైతులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేయడం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
భారీగా పోలీసుల మోహరింపు..
ఈ భూసేకరణ ప్రక్రియకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తమ భూములను కాపాడుకునేందుకు పొలాల్లోకి దూసుకెళ్లిన మహిళా రైతులను, వృద్ధులను సైతం పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగాయి. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల కోసం పోరాడుతుంటే, శాంతిభద్రతల పేరుతో తమను సొంత భూముల్లోనే ఖైదీలుగా మారుస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
పరిహారం లేని అభివృద్ధి ఎవరి కోసం?
అభివృద్ధి పేరుతో అన్నదాతల పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. CRDA అధికారులు చట్ట నిబంధనలను తుంగలో తొక్కి, బలప్రయోగంతో భూములను స్వాధీనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే తాము ఆత్మహత్యలే శరణ్యమని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: ఆ వెబ్ సీరిస్ చూసి.. థార్ కారుకు ఏటీఎంను కట్టి దోపిడి, కెమేరాలో రికార్డైన ఘటన
తాడేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రైతుల పంటలు ధ్వంసం
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలో సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూముల స్వాధీనం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలాల్లోని పంటలను సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం… pic.twitter.com/wnmoAvFqxp
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2026