Araku Monkey Coffee: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ హిల్ స్టేషన్ అయిన అరకు లోయ అనగానే ప్రతి ఒక్కరికీ అక్కడి అద్భుతమైన అందాలు, చల్లని వాతావరణంతో పాటు నోరూరించే కాఫీ కూడా గుర్తొస్తుంది. సాధారణంగా మనం రకరకాల రుచులు కలిగిన కాఫీలను తాగి ఉంటాము. కానీ ఇటీవల కాలంలో అరకులో లభించే ఒక ప్రత్యేకమైన కాఫీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. దాన్నే ‘మంకీ కాఫీ’ లేదా ‘మంకీ చూడ్ కాఫీ’ అని పిలుస్తారు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. దీనికి ఉన్న డిమాండ్, దీని ధర చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రకృతి ప్రసాదించిన వింతకు మనుషుల శ్రమ తోడైతే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చెప్పడానికి ఈ కాఫీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఈ మంకీ కాఫీ గింజలను మనుషులు నేరుగా చెట్ల నుంచి కోయరు. అరకు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే కోతులు తోటల్లోకి వచ్చి బాగా పండిన, ఎర్రగా ఉండి తీపిగా ఉండే కాఫీ పండ్లను ఏరికోరి తింటాయి. కోతులు ఈ పండ్లను తిని, లోపల ఉండే గింజలను నమలలేక, వాటిపై ఉండే గుజ్జును నోట్లో వేసుకుని చప్పరిస్తాయి. ఆ తర్వాత కేవలం గింజలను మాత్రం బయటకు ఉమ్మేస్తాయి. అలా కోతులు తోటల్లో అక్కడక్కడా ఉమ్మేసిన కాఫీ గింజలను అక్కడి గిరిజన రైతులు ఎంతో శ్రమకోర్చి, వెతికి మరీ సేకరిస్తారు. సాధారణ కాఫీ తయారీతో పోలిస్తే ఈ ప్రక్రియ చాలా భిన్నమైనది, ఆసక్తికరమైనది.
కోతులు కాఫీ పండ్లను నోట్లో వేసుకుని చప్పరించేటప్పుడు ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతుంది. వాటి లాలాజలంలో ఉండే కొన్ని రకాల సహజ ఎంజైములు ఆ కాఫీ గింజలతో రసాయనిక చర్య జరుపుతాయి. దీనివల్ల కాఫీ గింజల్లో సహజసిద్ధంగా ఉండే తీవ్రమైన చేదుతనం చాలావరకు తగ్గిపోతుంది. సాధారణంగా కాఫీ గింజలను ప్రాసెస్ చేయడానికి యంత్రాలను వాడతారు, కానీ ఇక్కడ కోతుల నోటి ద్వారానే ఒక సహజమైన ప్రాసెసింగ్ జరిగిపోతుంది. ఈ రసాయన మార్పుల వల్లే ఈ కాఫీకి అంతటి ప్రత్యేకత, విలక్షణమైన గుర్తింపు లభించింది.
Also Read: రెడ్ ఫ్లాష్‌లైట్ ఎందుకంత స్పెషల్? పోలీసుల నుంచి ఆస్ట్రానమర్ల వరకు అందరూ దీన్నే వాడతారెందుకు?
కోతుల లాలాజల ప్రక్రియ కారణంగా ఈ కాఫీకి ఒక రకమైన సహజమైన తీపి లభిస్తుంది. అలాగే ఇందులో మైల్డ్ సిట్రస్ అంటే స్వల్ప పులుపు ఫ్లేవర్‌తో పాటు అద్భుతమైన సువాసన కూడా తోడవుతాయి. మామూలు కాఫీతో పోలిస్తే.. ఇది తాగడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. గొంతులోకి దిగుతుంటే కాఫీ ప్రియులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కాఫీలో ఉండే చేదును ఇష్టపడని వారికి సైతం ఈ మంకీ కాఫీ ఎంతగానో నచ్చుతుంది. ఇందులోని సువాసన చుట్టుపక్కల ప్రాంతాన్ని సైతం అహ్లాదపరుస్తుంది.
మనుషుల కంటే కోతులకు ఏ పండ్లు బాగా పండాయి, ఏవి చాలా తీపిగా ఉన్నాయనేది ప్రకృతి పరంగా చాలా బాగా తెలుస్తుంది. అవి తోటల్లో ఉండే అన్ని పండ్లను ముట్టవు. కేవలం అత్యుత్తమ నాణ్యత గల, బాగా పండిన కాఫీ పండ్లను మాత్రమే ఎంచుకుని తింటాయి. అందువల్ల కోతులు ఉమ్మేసిన కాఫీ గింజలు బై-డిఫాల్ట్‌గా అత్యంత క్వాలిటీవి అయి ఉంటాయి. నాణ్యమైన పండ్లను వేరు చేయడానికి మనుషులు పడే శ్రమను ఇక్కడ కోతులే పూర్తి చేస్తాయి. దీనివల్ల లభించే ప్రతి గింజా కూడా మేలైన రకానికి చెందినదిగా మారుతుంది.
ఈ కాఫీని మనం ఫ్యాక్టరీల్లోనో లేదా తోటల్లోనో మనకు నచ్చినంత భారీగా పండించలేం. కోతులు ఎప్పుడు తోటల్లోలోకి వస్తాయో, ఎప్పుడు ఆ పండ్లను తిని ఉమ్మేస్తాయో చూసి, వాటి వెనుక తిరిగి వెతకాలి. ఇది చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే దొరుకుతుంది. సేకరించిన తర్వాత వీటిని గిరిజనులు అత్యంత పరిశుభ్రంగా కడిగి, ఎండబెట్టి, ఆ తర్వాత రోస్ట్ చేస్తారు. మార్కెట్లో దీని లభ్యత చాలా తక్కువగా ఉండటం.. అలాగే దీనిని సేకరించడానికి గిరిజనులు పడే శ్రమ ఎక్కువ కావడంతో ఈ కాఫీ ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కిలో వేల రూపాయల పలుకుతుంది.
ఇండోనేషియాలో లభించే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘లువాక్ కాఫీ’ లాంటిదే మన అరకు మంకీ కాఫీ కూడా. అయితే ఈ రెండింటికీ పెద్ద వ్యత్యాసం ఉంది. లువాక్ కాఫీ అనేది పునుగు పిల్లి కాఫీ పండ్లను తిన్న తర్వాత దాని జీర్ణవ్యవస్థ గుండా ప్రయాణించి, విసర్జితాల రూపంలో బయటకు వస్తుంది. కానీ అరకు మంకీ కాఫీ కేవలం కోతులు నోట్లో చప్పరించి ఉమ్మేసినది మాత్రమే. కాబట్టి.. ఇది వినడానికి, తాగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సహజసిద్ధమైన అడవుల వాతావరణం, గిరిజనుల కష్టం, ప్రకృతి ఇచ్చిన వింత కలయికే ఈ అరకు మంకీ కాఫీకి అంతర్జాతీయంగా అంత క్రేజ్ తెచ్చిపెట్టింది.
Also Read: చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎందుకు ఉన్నాయి? దీని వెనుక ఉన్న 400 ఏళ్ల నాటి రహస్యం ఇదే!