గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఓ మహిళా ఎమ్మార్వోతో ఆయన ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత టీడీపీకి కూడా అది కాస్త ఇబ్బందిగా మారింది. మళ్లీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి చింతమనేని వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈసారి ఆయన సాక్షి ఆఫీస్ పై దాడి చేశారని అంటున్నారు. తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని ఆయన చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతున్నా.. మరోసారి చింతమనేని వార్తల్లోకెక్కడం, అది కూడా దాడి చేశారని ఆయనపై ఆరోపణలు రావడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
టీడీపీలో చింతమనేని ఫైర్ బ్రాండ్. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, మహిళా ఎమ్మార్వోపై దాడి చేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రవర్తన సమర్థనీయంగా లేనట్టు వీడియో సాక్ష్యాలు కూడా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ ఫలితం 2019లో కనపడింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో చింతమనేని దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి మరో వివాదంతో ఆయన మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.
ఆఫీస్ పై దాడి..?
ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపైకి ఆయన దాడికి వెళ్లారంటూ వీడియోలను సాక్షి మీడియా బయటపెట్టింది. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు దెబ్బతిన్నట్టుగా కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. చింతమనేని, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆఫీస్ లోని కంప్యూటర్లు ధ్వంసం చేశారని అంటున్నారు.
In a shocking incident, TDP MLA Chintamaneni Prabhakar stormed into the Sakshi media office in Eluru along with his followers, causing chaos and damaging office property, including computers. This brazen act of vandalism came after Sakshi published a news report about an… pic.twitter.com/QIhTIoVYv6
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025
అసలు కారణం ఏంటి..?
దెందులూరు నియోజకవర్గానికి చెందిన దాసరి బాబూరావు అనే వ్యక్తికి చెందిన పొలంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని అంటున్నారు. అయితే సదరు బాబూరావు టీడీపీ ఆఫీస్ కి వెళ్లడం, అక్కడ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే చింతమనేని కారణం అంటూ సాక్షిలో కథనం వచ్చింది. దీన్ని ఎమ్మెల్యే ఖండించారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని ఆయన అంటున్నారు. ఆ విషయం కనుక్కోడానికే తాను సాక్షి ఆఫీస్ కి వచ్చానంటున్నారు చింతమనేని. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చెబుతున్నారు.
సాక్షి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. చింతమనేని సదరు రిపోర్టర్ తో ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోని కూడా సాక్షి సోషల్ మీడియాలో ఉంచింది. చింతమనేని వల్లే బాబూరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇక సాక్షి ఆఫీస్ పై దాడి అంటూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. తనపై కావాలనే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ చింతమనేని చెప్పడం విశేషం. మరి చింతమనేని విషయంలో నిజానిజాలు ఏంటో నిలకడమీద తెలియాల్సిందే. అయితే ఆయన రోడ్డెక్కడం, సాక్షి తమపై దాడి జరిగిందని చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.