ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ సస్పెన్షన్ ఊహించినదే అయినా ఇప్పటికే బాగా ఆలస్యం అయినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికైనా దువ్వాడను సస్పెండ్ చేయడం సంతోషమేనని కొందరు అంటున్నారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. pic.twitter.com/kjFfWhSPCI
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025
కేరాఫ్ మాధురి..
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది తమకు తాముగా జగన్ కి దూరం అవుతున్నారు. మరికొందరు సైలెంట్ గా ఉంటున్నారు. మిగిలిన వారిలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నా కూడా దువ్వాడలాంటి వారిని జగన్ దూరంగా పెట్టడం మాత్రం విశేషమే. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కూడా వైసీపీలో సంచలనంగా మారింది. అప్పట్లో ఆయన్ను పార్టీనుంచి దూరం పెట్టినా, తర్వాత అనధికారికంగా ఆయన జగన్ కు దగ్గరయ్యారు. విమర్శలొచ్చినా కూడా జగన్ కానీ, వైసీపీ కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడ వ్యవహారం సంచలనంగా మారింది. మొదట్లో కుటుంబ కలహాలంటూ కొంతమంది కొట్టిపారేశారు. కానీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించడంతో చివరకు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
దువ్వాడ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ ఉదారంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కుటుంబ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు ఆయనకు కొన్ని ఛాన్స్ లు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా ఆయన్ను టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత ఇటీవల కరెంటు బిల్లు కట్టకుండా, అధికారుల్ని తిట్టిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. మాధురి విషయం ఉండనే ఉంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది.
పీఏసీ తొలి మీటింగ్ లోనే సంచలనం..
పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఇటీవలే జగన్ ప్రక్షాళణ చేశారు. కొత్త కమిటీ తొలి మీటింగ్ లోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్ ని నియమించారు. అదే సమయంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కె.కె. రాజుని నియమించినట్టుగా పార్టీ ప్రకటించింది.
జూలు విదిల్చినట్టేనా..?
అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో మకాం పెట్టేవారు. అప్పుడప్పుడు ఆయన ఏపీకి వచ్చేవారు, తిరిగి వెంటనే బెంగళూరు వెళ్లేవారు. ఇటీవల కొంతకాలంగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. తాజాగా సజ్జల రీఎంట్రీ ఇచ్చారు. ఇటు జగన్ కూడా పీఏసీ పేరుతో కొత్త టీమ్ ని ఏర్పాటు చేసుకుని, దానికి సజ్జలను కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ టీమ్ తాజాగా భేటీ అయింది. ఈ భేటీలోనే కొత్త నిర్ణయాలు తీసుకున్నారు జగన్. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.