Amaravati AP Capital Gazette Notification: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ఏప్రిల్ 6, 2026న తన అంగీకారాన్ని తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ నూతన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5లో కీలక సవరణలు చేశారు. గతంలో చట్టంలో ఉన్న కొత్త రాజధాని ఉంటుందనే పదాల స్థానంలో, ఇకపై అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా పొందుపరిచారు. సెక్షన్ 5లోని ఎక్స్‌ప్లనేషన్-2 ప్రకారం, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం, 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలన్నీ ఇందులో భాగమవుతాయి. ఈ సవరణ చట్టం జూన్ 2, 2024 నుండి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుందని గెజిట్‌లో పేర్కొన్నారు.
ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల ద్వారా అమరావతి రాజధాని విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ముగింపు పలికింది. పార్లమెంటు చట్టం ద్వారా రాజధానిని నోటిఫై చేయడంతో, అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి తిరుగులేని చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని భారత గణతంత్ర డెబ్బై ఏడవ సంవత్సరంలో పార్లమెంటు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి సంతకంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర గెజిట్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ‘X’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజల, ముఖ్యంగా అమరావతి రైతుల విజయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత చేకూరినట్లయిందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మలుపని ఆయన పేర్కొన్నారు.
On behalf of my people of Andhra Pradesh, I express profound gratitude to Hon’ble President Smt. Droupadi Murmu Ji for her gracious assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, fulfilling the long-cherished dream of our capital.
I thank the Union Government…
— N Chandrababu Naidu (@ncbn) April 6, 2026