Wanaparthy Woman: వనపర్తి జిల్లా మదనపురం మండలం కరివెన తండాకు చెందిన సాంతమ్మ జీవితం చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కనీస సౌకర్యాలు లేని శిథిలమైన ఇంట్లో, భయం గుప్పిట్లో ఆమె కాలం వెళ్లదీస్తోంది.
ఇంట్లోనే 30 ఏళ్లుగా పాముల పుట్ట
పేదరికం కారణంగా ఉన్న చిన్న ఇల్లు కూలిపోయే స్థితికి చేరింది. దానికితోడు ఆ ఇంట్లోనే గత 30 ఏళ్లుగా ఒక పెద్ద పుట్ట పెరుగుతూ వస్తోంది. ఆ పుట్టలోకి తరచూ పాములు వచ్చిపోతుండటంతో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని సాంతమ్మ ప్రతిరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తోంది.
నరకప్రాయంగా మారిన వర్షాకాలం
ఇల్లు పూర్తిగా పాడైపోవడంతో వాన పడితే చాలు ఇంట్లోకి నీరు చేరి పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. పుట్ట పక్కనే బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. వయోభారంతో పాటు అనారోగ్యం కారణంగా పనులకు వెళ్లలేని స్థితిలో ఉన్న ఆమెకు, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బే తిండికి, మందులకు ఆధారమైంది. ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆ పుట్టను తొలగించుకోలేక, ఇల్లు బాగుచేసుకోలేక నరకం అనుభవిస్తోంది.
Also Read: లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!
అండగా నిలవాల్సిన బాధ్యత
ఒంటరిగా మిగిలిన ఈ వృద్ధురాలి దీనస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి సాంతమ్మకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, కూలిపోయే దశలో ఉన్న ఆ ఇంట్లో నుంచి ఆమెకు విముక్తి కల్పించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.