Eng vs Ban Women: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( Women’s ODI World Cup 2025 tournament )
నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Eng vs Ban Women ) మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ నిర్వహించారు. గౌహతి వేదికగా జరిగిన ఈ ఎనిమిదవ వరల్డ్ కప్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు మహిళల జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ మహిళల జట్టుపై ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్లు పట్టికలో కూడా ముందుకు దూసుకువెళ్ళింది ఇంగ్లాండ్. దీంతో ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన జట్టుగా నిలిచింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో మరో విజయం నమోదు చేసుకుంది ఇంగ్లాండ్ టీం. బంగ్లాదేశ్ మహిళల జట్టు పైన నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండు. బంగ్లాదేశ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదించింది. 46.1 ఓవర్స్ లో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసి విజయం సాధించింది ఇంగ్లాండ్. బంగ్లాపై ఇంగ్లాండ్ ప్లేయర్ హీథర్ నైట్ అద్భుతంగా రాణించింది. 111 బంతుల్లో 79 పరుగులు సాధించింది. చివరన వచ్చిన డీన్ 27 పరుగులతో రాణించింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్ళింది ఇంగ్లాండ్. అంతకు ముందు టీమిండియా మొదటి స్థానంలో ఉండేది. ఇవాల్టి మ్యాచ్ విజయంతో నాలుగు పాయింట్లు సంపాదించిన ఇంగ్లాండ్ రన్ రేట్ మెరుగుపరచుకొని మొదటి స్థానానికి వెళ్ళింది. నాలుగు పాయింట్ల తో టీమ్ ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 3 అలాగే బంగ్లాదేశ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పటిలాగే చిట్ట చివరన ఉంది.
ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 49.4 ఓవర్స్ ఆడిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 178 పరుగులకు కుప్పకూలింది. బంగ్లాదేశ్ మహిళల జట్టులో శోభన ఒక్కతే 60 పరుగులు చేసి దుమ్ము లేపింది. చివరలో వచ్చిన రబయ్ ఖాన్ 43 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక ఓపెనర్ గా వచ్చిన షర్మిన్ 30 పరుగులతో రాణించారు. ఈ ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కు అవుట్ అయ్యారు. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా అయితే డక్ అవుట్ అయ్యారు. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో సోపీ మూడు వికెట్లు పడగొట్టగా , స్మిత్, చార్లీ , క్యాప్సే తలో రెండు వికెట్లు పడగొట్టారు. బెల్ ఒకే ఒక వికెట్ పడగొట్టింది. దీంతో 178 పరుగులకే బంగ్లాదేశ్ కుప్పకూలింది.