అలిపిరి వద్ద రోడ్డు పక్కన ఉన్న శనీశ్వరుడి అసంపూర్ణ విగ్రహం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి హడావిడికి ఏకంగా ఆయనకు పోలీసులు నోటీసులిచ్చారు. టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయపై కేసు నమోదైంది. భూమన అరెస్ట్ అయితే దానికి కారణం ఆయన అత్యుత్సాహమేనని చెప్పక తప్పదు. గత పదేళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉంటే, కొత్తగా ఇప్పుడే దాన్ని పట్టించుకోనట్టు, పక్కనపడేసినట్టు భూమన చెప్పుకొచ్చారు. అపచారం అంటూ లేనిపోని ప్రచారం చేసి, చివరకు నాలుక కరుచుకున్నారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోలేదు, భూమనని మించిపోయేందుకు నేనున్నానంటూ తెరపైకి వచ్చారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల.
https://twitter.com/AreSyamala/status/1968256054850134354
శ్యామల ఆరోపణలు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు శ్యామల. అయితే దానికి ఆమె చూపించిన సాక్ష్యాలు, చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. ఈమధ్య చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయానికి తాళాలు వేసే క్రమంలో కొంతమంది జర్నలిస్ట్ లు అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చారు. దాన్ని వైసీపీ రాద్ధాంతం చేసింది. టీవీ-5 న్యూస్ రిపోర్టర్ ఫొటోతో వైసీపీ ట్వీట్ వేసి విమర్శలు మొదలు పెట్టింది. దానికి వెంటనే మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అక్కడ సాక్షి టీవీ రిపోర్టర్ కూడా ఉన్నాడు ఏం చేద్దామని ప్రశ్నించారు. జర్నలిస్ట్ లు సరదాగా దిగిన ఫొటోలతో రాజకీయమేంటని నిలదీశారు. ఈ విషయాన్ని శ్యామల పొడిగించే ప్రయత్నం చేశారు. సన్నిధిగొల్ల తీయాల్సిన తాళాన్ని ఒక రిపోర్టర్ తీస్తున్న ఫొటో అది అంటూ మాట్లాడారు. అసలు సన్నధిగొళ్ల తీసే తాళం ఎక్కడ ఉంటుంది, అది ఎప్పుడు జరుగుతుంది, ఆ తాళం చెవిని ఇంకెవరికైనా ఇస్తారా? ఇలాంటి విషయాలేవీ తెలియకుండా విమర్శలు చేసిన శ్యామల, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తిరుమల గురించి కనీస సమాచారం తెలియకుండానే రాజకీయ విమర్శలు దేనికంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అది విష్ణుమూర్తి విగ్రహమే…!
అలిపిరి వద్ద ఉన్నది శనీశ్వరుడి విగ్రహం అంటూ టీటీడీ బోర్డ్ సభ్యులే క్లారిటీ ఇచ్చిన తర్వాత శ్యామల మరోసారి అదే విషయాన్ని హైలైట్ చేయడం విశేషం. అది ముమ్మాటికీ విష్ణుమూర్తి విగ్రహమేనని ఆమె తేల్చేశారు. అరెస్ట్ లకు ఎవరూ వెనక్కి తగ్గబోరని అన్నారు. భూమనను అరెస్ట్ చేస్తున్నారని చెప్పే క్రమంలో గతంలో తిరుమలపై వచ్చిన విమర్శలన్నిటినీ ఆమె ఏకరువు పెట్టారు. గతంలో ఆ విమర్శలన్నీ వైసీపీ చేసినవే. వాటికి ప్రభుత్వంతోపాటు, టీటీడీ కూడా వివరణ ఇచ్చింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చేసింది. అయితే శ్యామల తాజాగా మరోసారి అవే ఆరోపణలు చేయడం విశేషం. భూమనకు మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన ఆమె, అరెస్ట్ లు చేసుకోండంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు అందించిన ఎస్ఐ అజిత
అలిపిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుపై బి.ఎన్.ఎస్ 35(3)కింద నోటీసులు అందజేత
రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టిన కూటమి ప్రభుత్వం
విష్ణువు విగ్రహం, శనీశ్వర విగ్రహంకు తేడా… pic.twitter.com/2IUhf7Jksk
— YSR Congress Party (@YSRCParty) September 17, 2025
భూమన ఒంటరి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారానికోసారి తిరుమలకు వెళ్లే రోజా కూడా ఈ వివాదంపై నోరు మెదపకపోవడం విశేషం. తిరుమల అంటే ముందుండే చాలామంది నాయకులు కూడా ఈ వ్యవహారంపై స్పందించలేదు. విగ్రహం ఆనవాళ్లు తెలియకుండానే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు భూమన. ఆయనకు సపోర్ట్ చేసేందుకు వైసీపీ నేతలే ముందుకు రాని పరిస్థితి. ఈ దశలో అధికార ప్రతినిధిగా శ్యామల ఎంట్రీ ఆశ్చర్యం కలిగించకపోయినా, ఆమె వైసీపీని మరింత ఇరుకున పెట్టేలా మాట్లాడటం ఇక్కడ విశేషం.