AP High Court: ఓ కేసు విషయంలో సంచలన తీర్పు వెల్లడించింది ఏపీ హైకోర్టు. షెడ్యూల్డ్ కులాలవారు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని తేల్చి చెప్పింది. అలాంటి ప్రజలు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని క్లారిటీ ఇచ్చేసింది. చర్చి పాస్టర్ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. ఆపై కేసును కొట్టేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేశారని, తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని మండిపడింది.
పాలకులు కొన్ని నిర్ణయాలు తీసుకోలేని సందర్భం వచ్చినప్పుడు, న్యాయస్థానాలు సంచలన తీర్పులు వెల్లడిస్తాయి. గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయనుకోండి. అలాంటి కోవలోకి వస్తోంది ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఇంతకీ న్యాయస్థానం తీర్పు వెనుక అసలు కేసు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలు కేసు ఏంటి?
ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ నాలుగేళ్ల కిందట చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారని పాస్టర్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొత్తపాలెం గ్రామానికి చెందిన ఐదుగురిపై ఎస్సీ,ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు చకచకా కేసు నమోదు చేయడం జరిగిపోయింది.
ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ-ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. న్యాయస్థానం నుంచి తీర్పు రావాల్సివుంది. ఈ కేసు కొట్టేయాలంటూ నిందితులు మూడేళ్ల కిందట హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ తమ వాదనలు వినిపించారు.
ALSO READ: ఆ ఐదుగురు విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్, విమానంలో ఉచితంగా ప్రయాణించే ఛాన్స్
ఫిర్యాదుదారుడు గడిచిన పదేళ్లుగా పాస్టర్‌గా పని చేస్తున్నాడని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తు చేశారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని వాదించారు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారన్న విషయాన్ని అడ్వకేట్ గుర్తు చేశారు.
వాదోప వాదనలు, ఆపై
కుల వ్యవస్థను క్రైస్తవ మతం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించినవారు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్సీ అని తహసీల్దార్ ధ్రువ పత్రం ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారన్నారు. ఇరువర్గాల వాదోపవాదనలు విన్నారు న్యాయమూర్తి. చివరకు పిటిషనర్ల తరపు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలతో ఏకీభవించారు. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దారుడు రక్షణ పొందే ఛాన్స్ లేదన్నారు. నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో ప్రస్తావించారు. న్యాయస్థానం తీర్పు అధికారులకు ఇదొక చెంప దెబ్బగా ఫిర్యాదుదారులు వర్ణించారు.