Housing Permission For Rupee: పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నిర్మాణ అనుమతులకు చెల్లించే భారీ ఫీజులను గణనీయంగా తగ్గించింది. పట్టణాలు, నగరాల్లో 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతి ఫీజు రూపాయి చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతులపై ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 50 చదరపు గజాలలోపు నిర్మించే G+1 బిల్డింగ్ ఫీజు కేవలం ఒక రూపాయి మాత్రమే ఉంటుందని వెల్లడించింది. మిగిలిన ఛార్జీలు వసూలు చేయరని స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై ఏటా రూ.6 కోట్ల మేర భారం తగ్గుతుంది. దరఖాస్తు సమయంలో ఇంటి ప్లాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం పేద, మధ్య తరగతి కుటుంబాలు రెండంతస్తుల ఇళ్లకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఫీజులు చెల్లిస్తున్నారు.
రాష్ట్రంలోని 123 నగర స్థానిక సంస్థలు, 35 పట్టణ మున్సిపాలిటీలకు ఈ విధానం అమలుచేయనున్నారు. రెండోసారి ఇంటి నిర్మాణానికి ఫీజు రూ.3గా నిర్ణయించారు.
ఏపీలో ఏటా సుమారు 35 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తున్నారు. వీటిలో 30% వరకు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణ అనుమతులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి వీరిపై ఈ భారం తగ్గనుంది. 50 చ.గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు పెద్ద భవనాల మాదిరిగా పనులు పూర్తయ్యాక ధ్రువీకరణ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరంలేదు.
అయితే 50 చ.గజాల్లో ఇంటి నిర్మాణానికే మాత్రమే రూపాయి ఫీజు వర్తిస్తుంది. ఆ సంస్థలో షాపులు లేదా వాణిజ్య కట్టడాలు నిర్మిస్తే యథావిధిగా ఫీజులు చెల్లించాలి. 60 చదరపు గజాల స్థలాన్ని 50 గజాలకు కుదించి ఇల్లు నిర్మించినా ఈ రాయితీ వర్తించదు. ప్రభుత్వ భూమి లేదా వివాదాస్పద స్థలాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వరు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
Also Read: Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..
రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఇళ్ల నిర్మాణాలపై ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.1,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఫీజుల్లో రాయితీతో ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. అయితే అనుమతుల ఫీజుల భారం తగ్గడంతో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తుంది.