Tirumala: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల కొండపై మరో వివాదం నెలకొంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన భూత కోల నృత్య ప్రదర్శన.. తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో.. ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడంపై శ్రీవారి భక్తులు, హిందూ సంప్రదాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు.. భూత కోల నిర్వహణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలేంటి?
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భూత కోల జానపద నృత్యం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన భూత కోల జానపద నృత్య ప్రదర్శనపై పెను దుమారం రేగింది. హిందూ సంప్రదాయంలో.. ఇది విరుద్ధమని కొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి నృత్య ప్రదర్శనల్ని తిరుమల కొండపై ఎలా అనుమతిస్తారని భక్తులు సీరియస్ అవుతున్నారు.
ఆత్మలకు సంబంధించిన ఆచారమని నెట్టింట్లో కామెంట్స్
భూత కోల అనేది ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు చేసే ఓ ఆచారమని, అలాంటి దానిని ఆలయాల్లో, తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ప్రదర్శించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు శ్రీవారి భక్తులు. ఈ వీడియో వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో ఆగమశాస్త్ర పండితులు ఏం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. కొండపై జరిగే ప్రతి ఉత్సవాల్లో.. స్వామివారి రూపం తప్ప మరో రూపానికి అవకాశమే లేదని.. టీటీడీ వారు కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూత కోల నృత్య ప్రదర్శనపై భక్తుల ఆగ్రహం
శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల్లో.. కేవలం ఆగమ శాస్త్రం, శ్రీవారి సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు మాత్రమే నిర్వహించాలి. భూత కోల అనేది.. కర్ణాటకకు చెందిన ఓ ప్రాంతీయ జానపద కళారూపం. ఇది హిందూ ఆరాధనలో భాగమే అయినప్పటికీ, తిరుమలలోని సంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు సరిపోదని భక్తులు వాదిస్తున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటులో.. టీటీడీ ఆగమ శాస్త్ర నిపుణులు, సాంస్కృతిక విభాగం అవగాహన లోపంతో వ్యవహరించారని.. సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా
భూత కోల నిర్వహించిన వారిని బహిష్కరించాలని డిమాండ్..
అయితే, భూత కోల వరాహారూప ఆరాధన ప్రక్రియ అని, వరాహ స్వామి కొలువైన తిరుమల కొండపై ఈ ప్రదర్శన నిర్వహించడంలో తప్పులేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆచార, సంప్రదాయ వైవిధ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నమే తప్ప.. మరొకటి కాదంటున్నారు. వివిధ సంప్రదాయాలను ప్రదర్శించడం, హిందు ధర్మంలో భిన్నత్వాన్ని తెలియజేయడమే కానీ.. విరుద్ధం కాదని అంటున్నారు. ఏదేమైనా.. తిరుమలలో చోటుచేసుకున్న ఈ పరిణామం.. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ ఈ వివాదంపై స్పందించి, భక్తుల మనోభావాలను గౌరవించాలని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్.