Pawan Klayan: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక చోట ఆలయాల అపవిత్రతకు పరిస్థితులు దారి తీశాయి. తమ కూటమి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
తిరుమల లడ్డు వివాదం సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కాగా తన 11 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న పవన్.. తిరుమల శ్రీవారిని రేపు దర్శించుకోనున్నారు. కాగా నిన్న తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తప్పంతా తమదే అంటూ కూటమి నేతలు ముమ్మర ప్రచారం చేశారని, తాము ఆ మహాపాపంకు పాల్పడలేదని చెప్పినా వినుకోలేదని వైసీపీ విమర్శలు గుప్పించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా.. కూటమి నేతలు సారీ చెప్పాలన్న నినాదాన్ని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
Also Read: Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?
అయితే తిరుమల పర్యటనకు వెళుతున్న పవన్ తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై, వైసీపీ విమర్శలపై స్పందించారు. పవన్ మాట్లాడుతూ.. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. న్యాయస్థానం ముందున్న సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసిందని తాను భావిస్తునట్లు తెలిపారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పలేదు కానీ.. తేదీ విషయంలో మాత్రమే కాస్త కన్ఫ్యూజన్ ఉందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఉల్లంఘనలు ఆలయాల విషయంలో చాలా జరిగాయన్నారు.
కూటమి ప్రభుత్వం వాటిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటుందని, అలాగే దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేసినట్లు తెలిపారు. కాగా తాను దీక్ష చేపట్టడంపై పవన్ స్పందిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లాలనే దీక్ష చేపట్టారన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం ఇప్పుడు చాలా ఉందని, ఆ బోర్డు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఆలయాల పరిరక్షణకై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. తాను ఈ దీక్షను పూర్తి చేసిన తర్వాత, రేపు డిక్లరేషన్ చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ తిరుమల పర్యటన సంధర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రాత్రికి తిరుమలలో బస చేసే పవన్.. రేపు దీక్షను విరమిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను సైతం అధికారులు పూర్తి చేశారు. పవన్ పర్యటించే ప్రాంతాలలో పోలీసులు నిఘా పెంచారు. జనసేన నాయకులు సైతం పవన్ పర్యటనలో పాల్గొనేందుకు తిరుమలకు చేరుకున్నారు.