AP Land Grabbing Case: వైసీపీ లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయా? గడిచిన ఐదేళ్లలో చేసిన పాపాల పుట్ట పగిలిందా? ఫ్రీ హోల్డ్ ముసుగులో ఆనాటి కొందరు పెద్దలు వేలాది ఎకరాలు స్వాహా చేశారా? ఒక్క ఇబ్రహీంపట్నంలో వంద కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయా? పాన్ కార్డు లేకుండా రిజిస్ట్రేషన్లు చేశారా? ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నారని శ్రీకాంత్ ఎందుకన్నారు? ఆయనకు బెదిరింపుల వెనుక ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
గతేడాది ముంబై నటి జెత్వానీ వ్యవహారం ఆనాటి వైసీపీ సర్కార్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ఈ అంశంపై రెండు నెలలపాటు వార్తలు హంగామా చేశాయంటే ఈ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. స్టిల్.. ఇప్పటికీ ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. పలువురు ఐపీఎస్ అధికారులు సైతం సస్పెండ్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యవహారంతో వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది.
ఈ ఏడాదైనా వైసీపీకి మంచి జరుగుతుందని చాలామంది నేతలు భావించారు. కానీ పాపాల పుట్ట పగిలిపోయి ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అరెస్ట్, లేఖలు వ్యవహారం మరింత ముదిరింది. వందల కోట్ల రూపాయల భూములు రిజిస్ట్రేషన్ల వెనుక చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడంటూ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారాయన.
ఆదివారం పలు మీడియా ఛానెళ్లతో మాట్లాడాడు చీమకుర్తి శ్రీకాంత్. కీలక విషయాలు బయటపెట్టాడు. ఈ వ్యవహారంలో తాను చిన్న వ్యక్తిని మాత్రమేనని అన్నాడు. భూ కబ్జాలకు ఆనాటి పెద్దలు సజ్జల, ధనుంజయ్‌రెడ్డి, కెఎన్ఆర్, సునీల్ ప్రధాన పాత్ర పోషించారన్నది ఆయన వెర్షన్.
ALSO READ: ఏపీలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు.. ముగ్గురు మృతి
విచారణలో మా పేరు చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరింపులకు దిగినట్టు తెలిపాడు. ఇప్పటికే శ్రీకాంత్ ఇంటికి అజ్ఞాత వ్యక్తుల నుంచి ఓ లేఖ వచ్చిందట. సింపుల్‌గా చెప్పాలంటే తనకు ప్రాణహాని వుందని ఓపెన్ అయిపోయాడు. మిగతా వారిని వదిలి తనను టార్గెట్ చేయడం సరైంది కాదన్నాడు శ్రీకాంత్.
ఆనాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి తనను వాడుకున్నారని, ఆయన మేనల్లుడు నిత్యం తనతో టచ్‌లో ఉండేవాడని తెలిపాడు. సజ్జల పీఏ దశరధరామిరెడ్డి, ధర్మసింగ్ ద్వారా కేఎన్ఆర్ తనకు టచ్‌లోకి వచ్చిన విషయాన్ని వివరించాడు. వీరితోపాటు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ అల్లుడు ఉన్నాడని సమాచారం. తనను ఉపయోగించుకుని అనేక పనులు చేయించుకున్నారని వాపోయాడు.
భూముల ట్రాన్స్‌ఫర్ విషయంలో 12 మంది సబ్ రిజిస్ట్రార్లు ఆనాటి పెద్దలతో టచ్‌లో ఉన్నారన్నది కొత్త పాయింట్. విచారణ జరుగుతున్న సమయంలో తన ఇంటికి ఏసీబీ అధికారులపేరుతో కొందరు తమ ఫోన్లు తీసుకెళ్లారట. వైసీపీ మాజీ మంత్రి చెందిన గోవాలోని ఓ రిసార్ట్ వేదికగా ఈ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది.
భూముల కబ్జాల వ్యవహారం విజయనగరం- భోగాపురం, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో అక్రమ లావాదేవీలు బయటకు తీశారు. ప్రత్యేకంగా సిట్ వేసి విచారణ చేయిస్తే మిగతా ప్రాంతాల్లో జరిగిన లావాదేవీలు బయటకు రావచ్చు. ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూముల లెక్కలు బయటకు తీస్తే వాటి విలువ వేల కోట్లలో ఉంటుందని రెవిన్యూ వర్గాల మాట. మరి కూటమి సర్కార్ సిట్ వేస్తుందా? లేదా అన్నది చూడాలి.