AP Liquor case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు ఇద్దరు నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉండడంతో బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో నిందితుల ఆశలు అడియాశలయ్యాయి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏ మాత్రం ఊరట లభించలేదు. హైకోర్టులో ఉపశమనం లభించకపోయినా, కనీసం సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తుందని భావించారు. అక్కడా వీరికి నిరాశే ఎదురైంది. ఏపీ హైకోర్టు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం ముందు వచ్చింది. నిందితుల తరపు సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి, వికాష్ సింగ్‌లు తన వాదనలు వినింపించారు. విచారణకు సహకరిస్తున్నారని, పారిపోయే వ్యక్తులు కాదని వివరించారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో కేసులోని వివరాలు వెల్లడించారు. ఇదేమీ పెద్ద కేసు కాదన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. వీరిద్దరి కనుసన్నల్లో లిక్కర్ వ్యవహారం సాగిందని తెలిపారు. దాదాపు రూ. 3,200 కుంభకోణమని తెలిపారు. ఇందులో కుట్రలో చాలా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి హక్కులను హరించినట్టేనని వాదించారు. ఒకవేళ అరెస్టు చేయాలన్నా ముందస్తు కాళ్లకు బంధాలు వేసినట్టు అవుతుందన్నారు.
ALSO READ: 20 కేజీ వెయిట్ లాస్, ఇవాళ.. రేపా అన్నట్లుగా వంశీకి ఏమైంది?
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ అరెస్టు అయితే రెగ్యులర్ బెయిల్ దాఖలు చేయాలన్నారు.
లిక్కర్ కుంభకోణంలో అప్పటి సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కీలక నిందితులుగా ఉన్నారు. వీరు ముగ్గురు జగన్ అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా మొదలు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని సిట్ ప్రధాన ఆరోపణ. మరోవైపు మూడో రోజు నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అదుపులోకి విచారిస్తున్నారు సిట్ అధికారులు.