Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగలో 20 ఎకరాల్లో దీని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులు తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా ఎనుగుల విన్యాసాలను వీక్షించారు. అటవీశాఖకు చెందిన శిక్షణ పొందిన కుంకీ ఎనుగులు కృష్ణా, అభిమన్యులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాయి. అనంతరం పవన్ స్వయంగా వాటికి ఆహారం అందిస్తూ, వాటిని ముద్దాడి స్నేహపూర్వకంగా వ్యవహరించారు. ఎనుగులను చూసి ఆనందం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, అడవుల సంరక్షణలో కుంకీ ఎనుగుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
తర్వాత అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, హనుమాన్ అనే కొత్త కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హనుమాన్ అనే పదానికి విస్తృత రూపం Healing and Nurturing Units for Monitoring Aid and Wildlife అని వివరిస్తూ, ఇది అడవులు, జంతువులు, పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు వివరించిన ప్రకారం.. హనుమాన్ లో మొత్తం 11 ప్రధాన అంశాలను పొందుపరిచారు. వీటిలో వన్యప్రాణి సంరక్షణ, పునర్వనీకరణ, వైల్డ్ లైఫ్ హెల్త్ మానిటరింగ్, స్మార్ట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, ఈకో టూరిజం అభివృద్ధి వంటి అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ లక్ష్యాలను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
అలాగే ఆయన ఈ నెల 18, 19 తేదీల్లో “హనుమాన్” ప్రాజెక్ట్‌పై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సమావేశంలో అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల అధికారులు పాల్గొని సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ పర్యటనతో ముసలి మడుగు పరిసరాల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డిప్యూటీ సీఎం సమక్షంలో అటవీ శాఖ అధికారులు పర్యావరణ పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు.
Also Read: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు
ఈ పర్యటనతో పాటు పవన్ కళ్యాణ్ పర్యాటకాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కూడా సమీక్షించారు. అటవీ, వన్యప్రాణి, పర్యాటక శాఖల సమన్వయంతో ముసలి మడుగును “ఎకో-టూరిజం హబ్”గా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.