AP liquor scam Updates: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీకి చెమటలు పడుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేసుని ఏపీ సిట్ దర్యాప్తు చేసింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగేసింది. కేసులోని కీలక నేతలకు నోటీసులు జారీ చేస్తోంది. ఆ జాబితాలోకి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చేరిపోయారు. ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరురావాలని నోటీసుల్లో ప్రస్తావించింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లోకి ఈడీ దిగేసింది
ఏపీలోని లిక్కర్ కుంభకోణం కేసు జోరందుకుంది. ఇప్పటివరకు సిట్ దర్యాప్తు చేసిన వివరాలు తీసుకుని పరిశీలించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, దాని ఆధారంగా ప్రమేయమున్న నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలైంది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ, తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
జనవరి 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అనుమానిస్తోంది ఈడీ. హవాలా మనీ ల్యాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణ లేకపోలేదు.
విజయసాయిరెడ్డి తర్వాత మిథున్‌రెడ్డి వంతైంది
ఈ కేసులో ఇదివరకు మిథున్‌రెడ్డి అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండురోజుల కిందట ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయన కూడా జనవరి 22 విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఈడీ దాడులు చేసింది.
ఆ సమయంలో ఎలాంటి సమాచారం ఈడీ అందుకుందో తెలీదు. దాని ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ ద్వారా వచ్చి సొమ్ముల ద్వారా బంగారం కొనుగోలు చేయడం, విదేశాలను తరలించడం జరిగినట్టు అధికారులు గుర్తించారు.
ALSO READ: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్‌గా శ్రీనివాసరావు
ఇక రాజ్ కసిరెడ్డి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేశారు. ఈ స్కామ్‌లో తవ్వే కొద్దీ కొత్త విషయాలు రావడంతో ఎంపీ మిథున్ రెడ్డి నోటీసులు ఇచ్చారని అంటున్నారు. వీరిద్దరి విచారణ తర్వాత మరికొందరికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈడీ నోటీసులతో వైసీపీలో గుబులు మొదలైంది. ఈడీ తమను ఎక్కడ అరెస్టు చేస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.