పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ, జనసేనను బలహీన పరిచేందుకు ఏపీలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని పవన్ అభిమానులు అనుమానిస్తున్నారు. శ్రీకాళహస్తి మాజీ నేత వినుత కోట విషయంలో వెంకటగిరి జనసేన నాయకుడిపై పోలీసులు కేసు పెట్టారని ఓ వర్గం తెగ సింపతీ చూపిస్తోంది. మర్డర్ కేసులో ఇరుక్కున్న వినుత కోటను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పవన్, గట్టి సంకేతాలు పంపించారు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా మాట్లాడిన వారిపై పోలీసు కేసు ఉంటే పవన్ వారిని సమర్థించాలా? ఇదెక్కడిలాజిక్ అని అడుగుతున్నారు జనసేన నేతలు. అయితే కొంతమంది మాత్రం పార్టీలోనివారిని పవన్ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ వాదనల వెనక ఎవరున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవల కాలంలో వినుత కోట వాయిస్ ని కాస్త బలంగానే వినిపిస్తోంది వైసీపీ మీడియా, వైసీపీ అనుకూల సోషల్ మీడియా. జనసేనలో పార్టీకి వ్యతిరేకంగా కొందర్ని కూడదీయాలని చూస్తోంది.
కందుకూరు గందరగోళం..
ఇక కుందుకూరు ఘటనలో వ్యక్తిగత దాడిని కులాలకు ఆపాదిస్తూ మరికొందరు హడావిడి చేస్తున్నారు..? ఇక్కడ కూడా కులం కార్డు తీసుకొచ్చి పవన్, కాపుల్ని పట్టించుకోవడం లేదనే ప్రచారం మొదలు పెట్టారు. కొంతమంది వైసీపీ నేతలు బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. వారితోపాటు జనసేనలోనే ఉన్నామని చెప్పుకుంటున్న మరికొందరు నేతలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ వైసీపీ ఈ విషయాన్ని హైజాక్ చేసిందని చెప్పాలి. కులం కార్డు వాడి పవన్ ని కార్నర్ చేయాలని చూస్తోంది. పవన్ కల్యాణ్ ఈ విషయంలో నేరుగా స్పందించాలంటోంది. కాపులకు అన్యాయం జరిగితే పవన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని సాక్షి కూడా ప్రశ్నిస్తోంది.
కుట్ర ఎవరిది?
ఇక నెల్లూరు జనసేన గొడవ మనకు తెలిసిందే. ఇక్కడ కూడా జనసేనలో బలమైన నాయకుడిని టార్గెట్ చేసి, అసంతృప్త నేతల్ని ఎవరో వెనకుండి నడిపించినట్టు అనుమానాలున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జనసేనలో ఓ వర్గాన్ని బయటకు తీసి, వారిని పార్టీకి దూరం చేసి, టోటల్ గా కూటమికి కూడా దూరం చేసే ప్రయత్నాలుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలన్నిటికీ సాక్షి మీడియా, వైసీపీ అనుకూల సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి నారాయణ వ్యాఖ్యల్ని కూడా సాక్షి హైలైట్ చేయడం కూటమిని కూల్చే కుట్రేనని టీడీపీ నేతలు అంటున్నారు. జనసేనలో కూడా లుకలుకలు మొదలవ్వాలని వైసీపీ కుట్రలు చేస్తోందని అంటున్నారు.
Also Read:సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు వైరల్
పవన్ కాపులకే నాయకుడా?
ఇటీవల కందుకూరు ఘటన తర్వాత జనసేనలో ఉన్న కొంతమంది నేతలు కూడా పవన్ కల్యాణ్ స్పందించాలి, రావాలి, నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేనలోని కొందరు నేతలు వారికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. పవన్ పై కాపు నాయకుడు అనే ముద్ర వేయొద్దని ఆయన ప్రజా నాయకుడని అంటున్నారు. పవన్ ని ఓ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయొద్దంటున్నారు. మరి జనసేనలోనే ఉంటూ, పవన్ ని టార్గెట్ చేస్తున్నవారిని ఏమనాలి, ఎవరి లాభం కోసం వారు పని చేస్తున్నారు, ఏ పార్టీ మెప్పు కోసం వారు పవన్ ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. కూటమిలో కుమ్ములాట రాకపోయినా, కనీసం జనసేనలో పవన్ ని బలహీన పరచాలనే కుట్రతో వైసీపీ మద్దతుతో ఇవన్నీ జరుగుతున్నాయని పవన్ అభిమానులు అనుమానిస్తున్నారు.
Also Read: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?